‘చలి’గింతలు
● భారీగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు
● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘చలి’ గింతలు పెరిగాయి. చలి పంజా మొదలు కావడంతో ప్రజలు గజగజలాడిపోతున్న పరిస్థితి నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య కొనసాగుతుండగా... రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం మరింత తగ్గిపోవడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం వేకువజామున మడకశిర మండలంలో 12.7 డిగ్రీలు, శెట్టూరులో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ప్రస్తుతానికి ఇవే కనిష్ట ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. రొద్దం 13.8 డిగ్రీలు, సోమందేపల్లి 13.9, బెళుగుప్ప 14.1, అమరాపురం 14.1, గుడిబండ 14.3, గుమ్మఘట్ట 14.5, వజ్రకరూరు 14.9 డిగ్రీలు ఇలా చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 12 డిగ్రీలకు పతనం కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హీటర్లు, స్వెట్లర్లకు గిరాకీ పెరిగింది. రాత్రిళ్లు, ఉదయం పూట చలి నుంచి కాపాడుకునేందుకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్దులు, బాలింతలు, గర్భిణులు, రోగులు, ఉదయం శ్రామిక వర్గాలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.


