ఇక ‘అక్రమ’ సర్వేయర్ల వంతు..
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివారులోని పాపంపేట శోత్రియం భూముల వ్యవహారంలో ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్, మాజీ సర్వేయర్ ప్రతాప్‌రెడ్డిపై విచారణ నివేదిక ఇచ్చి తదుపరి చర్యలకు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌కు సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ భూముల వ్యవహారంలో వీఆర్‌ఓ రఘుయాదవ్ పాత్రపై ఉన్నతాధికారులకు స్పష్టత వచ్చింది. ఆరు సర్వే నంబర్లలో 29.96 ఎకరాల్లో రాచూరి వెంకటకిరణ్ అనుభవంలో ఉన్నాడంటూ 2024 ఆగస్టు 13న వీఆర్‌ఓ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అసలు వీఆర్‌ఓకు ఈ అధికారమే ఉండదు. అయినా మొండి ధైర్యంతో ముందుకెళ్లాడు. కఠిన చర్యలు తీసుకునే క్రమంలో కలెక్టర్ ఆనంద్ ఆర్టికల్ చార్జెస్ ఫ్రేమ్ నోటీసు ఇవ్వడం ఉలికిపాటుకు గురి చేసింది. తాజాగా సర్వేయర్ల పాత్రపై స్పష్టత వచ్చింది. రాచూరి వెంకట కిరణ్ అందజేసిన డాక్యుమెంట్లు 984/1910, 1607/ 1952, 324/1956, 1628/1958 మేరకు విస్తీర్ణం 300 ఎకరాలుగా ఉన్నట్లు పూర్వ సర్వేయర్ ప్రతాప్‌రెడ్డి 2024 జూన్ 24న నివేదిక ఇచ్చాడు. ఈయన క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎలాంటి సర్వే చేయలేదు. కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా నివేదిక ఇచ్చాడు.
సమాచారం ఇవ్వకుండానే..
ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్ బరి తెగించి నివేదిక ఇచ్చాడు. చుట్టుపక్కల వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా భూములు సర్వే చేశాడు. పైగా చుట్టుపక్కలంతా రైతులే ఉన్నారని వారందరికీ వాట్సాప్‌లో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నాడు. నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి రాచూరి వెంకటకిరణ్, వారి కుటుంబ సభ్యుల పేరిట సుమారు 160 ఎకరాలు హక్కు అనుభవంలో ఉన్నట్లు ఏకపక్షంగా రిపోర్ట్ ఇచ్చాడు. ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వెంకటకిరణ్, ఆయన కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏ చేయించు కున్న వారు మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.
డైరెక్టర్‌కు సిఫార్సు చేసిన డిప్యూటీ డైరెక్టర్
పాపంపేట భూ వివాదంలో సర్వేయర్ల పాత్రపై టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పూర్వపు సర్వేయర్ ప్రతాప్‌రెడ్డి, ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సర్వే డిప్యూటీ డైరెక్టర్ పి.హరికృష్ణ ఏపీ ప్రభుత్వ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. త్వరలోనే ఇద్దరు సర్వేయర్లు, వీఆర్‌ఓపై చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు.
పాపంపేట భూ వ్యవహారంలో ఇద్దరు సర్వేయర్లపై చర్యలకు నివేదిక
ఇప్పటికే వీఆర్‌ఓ రఘుయాదవ్‌కు చార్జెస్ ఆఫ్ ఫ్రేమ్ నోటీసు జారీ
ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధం


