మందకొడిగా రబీ
● 48 వేల హెక్టార్లలో ‘సాగు’తోన్న పంటలు
అనంతపురం అగ్రికల్చర్: రబీ మందకొడిగా ‘సాగు’తోంది. సకాలంలో విత్తన పప్పుశనగ, విత్తన వేరుశనగ పంపిణీ చేయకపోవడం, వర్షాభావ పరిస్థితులు వెరసి పంటల సాగు తక్కువగానే ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఈ రబీలో 1,07,261 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి 45 శాతంతో 48 వేల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో వర్షాధారంగా ప్రధానపంట పప్పుశనగ 65,017 హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 40 వేల హెక్టార్లలో సాగు చేశారు. నీటి వసతి కింద 17,982 హెక్టార్లుగా అంచనా వేసిన వేరుశనగ 1,700 హెక్టార్లలో ‘సాగు’తోంది. 7,888 హెక్టార్లకు గానూ మొక్కజొన్న 2,100 హెక్టార్లు, 5 వేల హెక్టార్లకు గానూ 2,500 హెక్టార్లలో జొన్న సాగు చేశారు. ఇవి కాకుండా సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, మినుము, ఉలవ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, సోయాబీన్, పత్తి తదితర పంటలు నామమాత్రంగా విత్తుకున్నారు. 6,069 హెక్టార్లు అంచనా వేసిన వరి నాట్లు ఇప్పుడే మొదలు పెట్టారు. డిసెంబర్ 15 వరకు వేరుశనగ సాగుకు అనుకూలం కాగా డిసెంబర్ ఆఖరు వరకు వరికి అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పప్పుశనగ సాగుకు ఈనెల 15తో అదను ముగిసిపోవడం గమనార్హం.


