చీటీల పేరుతో మోసం చేశారని ఇంటిపై దాడి | - | Sakshi
Sakshi News home page

చీటీల పేరుతో మోసం చేశారని ఇంటిపై దాడి

Nov 18 2025 6:56 AM | Updated on Nov 18 2025 6:56 AM

చీటీల

చీటీల పేరుతో మోసం చేశారని ఇంటిపై దాడి

గుంతకల్లు:చీటీల పేరుతో మోసం చేశారంటూ నిర్వాహకురాలి ఇంటిపై బాధితులు దాడి చేసిన ఘటన గుంతకల్లులో జరిగింది. వివరాలు.. పట్టణంలోని ధర్మవరం గేట్‌ సమీపంలో షాహి ఫొటో స్టూడియో నిర్వాహకురాలు దిల్‌షాద్‌బేగం చీటీలు నడిపేది. తెలిసిన వాళ్లతో పాటు ఇరుగుపొరుగు చాలా మంది ఆమె వద్ద చీటీలు వేశారు. అయితే చీటీల గడువు పూర్తయినా దిల్‌షాద్‌బేగం డబ్బు మాత్రం ఇవ్వలేదు. చీటీలు వేసిన వారు అనేక సార్లు ఆమె ఇంటి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు పర్వీన్‌, షాకీరా, కౌసర్‌ తదితరులు ఎంఆర్‌పీఎస్‌ నాయకురాలు జ్యోతి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం దిల్‌షాద్‌బేగం ఇంటిని చుట్టుముట్టారు. దిల్‌షాద్‌బేగంతో పాటు తండ్రి మైనును బయటకు లాగి కళ్లలో కారం చల్లి దాడి చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు చేరుకుని దిల్‌షాద్‌బేగం, ఆమె తండ్రిని పోలీసుస్టేషన్‌కు తరలించడంతో అంతా స్టేషన్‌కు వెళ్లారు.

స్పౌజ్‌ కోటా కింద

అంతర్‌ జిల్లాల బదిలీలు

అనంతపురం సిటీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్‌ జిల్లాల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. స్పౌజ్‌ కోటా కింద మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించింది. కేవలం ‘రిక్వెస్ట్‌’పైనే బదిలీలుంటాయని జీఓలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా బదిలీలు నిర్వహిస్తారు. క్రమశిక్షణ చర్యలు, ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారికి అర్హత లేదు. నో డ్యూ సర్టిఫికెట్‌ విధిగా ఉండాలి. మెరిట్‌ ర్యాంక్‌ ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందిస్తారు. క్లియర్‌ వేకెన్సీ ఉన్నప్పుడు మాత్రమే బదిలీ చేస్తారు. కొత్త జిల్లాలో చివరి ర్యాంక్‌ కేటాయిస్తారు. సీనియారిటీ తరువాత డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నెల 30లోపు ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

వెల్లువెత్తిన వినతులు

పరిష్కార వేదికకు 395 అర్జీలు

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజల నుంచి కలెక్టర్‌ ఓ.ఆనంద్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, రమేష్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు.వివిధ సమస్యలపై మొత్తం 395 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా, ప్రతి సమస్యకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.

వినతుల్లో కొన్ని...

● రాజకీయ ఒత్తిళ్లతో తనపై 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్‌ చేశారని గుత్తి మండలం ఎంగన్నపల్లి చౌక దుకాణం (1206038) డీలర్‌ నాగన్న చౌదరి ఫిర్యాదు చేశాడు. దీనిపై పలుమార్లు అర్జీ ఇచ్చానని చెప్పాడు. సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని కోరాడు.

● తమకు అందాల్సిన ‘తల్లికి వందనం’ డబ్బులు వేరొకరి ఖాతాలో జమయ్యాయని, దీనిపై ఏడు సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం కాలేదని నార్పల గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాసులు వాపోయాడు.

● తమ ప్రాంతంలో రోడ్లు, కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని అనంతపురం నగరంలోని భాగ్యనగర్‌ 3వ క్రాస్‌కు చెందిన బి.రాధిక విన్నవించింది. దీంతో స్థానికులు, ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని, కాలనీలో రోడ్లు, కాలువలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

● కామారుపల్లి వద్ద ఇచ్చిన ఇంటి పట్టా రద్దు చేసి కొత్తగా ఇంటి స్థలం మంజూరు చేయాలని అనంతపురం నగర పరిధిలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన దివ్యాంగురాలు బి.బాలకొండమ్మ వేడుకుంది.

చీటీల పేరుతో మోసం చేశారని ఇంటిపై దాడి 1
1/1

చీటీల పేరుతో మోసం చేశారని ఇంటిపై దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement