ఐదుకల్లులో అక్రమ మైనింగ్ ఆపండి
అనంతపురం అర్బన్: శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామం వద్ద టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ను వెంటనే నిలిపి వేయించాలని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య కోరారు. సోమవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ పొలం సర్వే నంబరు 185లోని 292.55 ఎకరాల ఐదుకల్లు కొండను టీడీపీ నాయకులు పిండి చేస్తున్నారన్నారు. కొండపై పురాతన దేవాలయాలు, నీటి కొలనులు ఉన్నాయని, వన్యప్రాణులు ఆవాసం ఏర్పరచుకున్నాయని, వృక్ష సంపద కూడా అధికంగా ఉన్న ఇలాంటి కొండను కాపాడుకోవాల్సింది పోయి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బ్లాస్టింగ్ కారణంగా రైతుల బోరుబావులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యంతో గ్రామ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి ఆదేశాలతో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. అక్రమాలపై ప్రశ్నించిన ఐదుకల్లు గ్రామస్తులు భూలక్ష్మి, రామాంజనేయులు, ఎస్.నాగరాజు, బి.మంజులమ్మ, జ్యోతిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అక్రమ కేసు బనాయించారన్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి బ్లాస్టింగ్ నిలిపివేయించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజగోపాల్, జెడ్పీటీసీ మంజనాథ్, ఎంపీపీలు చంద్రశేఖర్‌రెడ్డి, సోమనాథరెడ్డి, అంజి, సర్పంచులు ఈరన్న, విజయ్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ రాజ్‌కుమార్, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, సుధీర్, హనుమంతరాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఎస్ రాయుడు, నాయకులు బిక్కిహరి, జిల్లా కార్యదర్శులు ఎర్పంపల్లి కృష్ణమూర్తి, రామాంజనేయులు యాదవ్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, పాత లింగ, దొడగట్ట మురళి, కనుమక్కపల్లి మల్లి, నారాయణ స్వామి, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కోరిన
మాజీ ఎంపీ తలారి రంగయ్య


