రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలకు సర్వం సిద్ధం
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలకు సర్వం సిద్ధమైంది. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు సీసీఎల్‌ఏ కలిపి మొత్తం 27 కంటింజెంట్లు అథ్లెటిక్స్, ఇతర క్రీడా విభాగాల్లో బరిలోకి దిగనున్నారు. గురువారం ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు, మాక్ మార్చ్‌ఫాస్ట్‌ను జేసీ శివ్‌నారాయణ్ శర్మ పరిశీలించారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ మలోల, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణా రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్ పాల్గొన్నారు.
‘శ్రేష్ట’కు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: ‘శ్రేష్ట’ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ స్కూళ్లలో ఉచితంగా సీటు లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ అధికారులు గురువారం తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ బాల బాలికలకు సీట్లు కేటాయిస్తారని వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ విద్యా సంస్థల్లో 9,11 తరగతుల్లో ఉచిత ప్రవేశం లభిస్తుందని పేర్కొన్నారు. పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. ఎస్సీ కేటగిరీకి చెందిన బాలబాలికలు ప్రస్తుతం 8 లేదా 10వ తరగతి చదువుతూ ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకు మించకూడదన్నారు. ఈ నెల 11లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 21న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారన్నారు. వివరాలకు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.
‘గాడి తప్పిన ఖాకీ’పై వేటు
● వీఆర్‌కు వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులు
అనంతపురం సెంట్రల్: నగరంలో వన్‌టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసులుపై వేటు పడింది. రేషన్ మాఫియాతో చేతులు కలిపి రూ. లక్షల ముడుపులు తీసుకోవడమే కాకుండా రేషన్ తరలిస్తున్న ఓ వాహనాన్ని గుట్టుచప్పుడు కాకుండా వదిలిపెట్టిన విషయంపై గత నెల 27న ‘గాడి తప్పిన ఖాకీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన ఎస్పీ పి. జగదీష్ విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం ఎస్‌ఐ శ్రీనివాసులును వీఆర్‌కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల క్రితం టీవీటవర్ సమీపంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మూడు వాహనాలను స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సహకారంతో వన్‌టౌన్ స్టేషన్‌కు తరలించారు. వాటిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేయాల్సిన ఎస్‌ఐ శ్రీనివాసులు కేసును తప్పుదోవ పట్టించారు. మూడింటిలో రెండు వాహనాలపై కేసు నమోదు చేశారు. ఒక వాహనాన్ని గుట్టుచప్పుడు కాకుండా వదిలిపెట్టారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ జగదీష్.. ఎస్‌ఐను వీఆర్‌కు పంపారు.
‘ఎస్‌ఐఆర్’కు
సిద్ధంగా ఉండండి
అనంతపురం అర్బన్: ‘‘త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2025 (ఎస్‌ఐఆర్) ప్రారంభం కానుంది. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. ప్రక్రియను పక్కాగా చేపట్టాలి’’ అని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ కుమార్ యాదవ్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఈఓ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఓ.ఆనంద్ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. సీఈఓ మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలన్నారు. మరణించిన వారి ఓటు తొలగించాలన్నారు. నివాసం మారిన వారు, పునరావృత ఎంట్రీలు వంటి తప్పులను సరిదిద్దాలన్నారు. ప్రతి బూత్‌లో ఇంటింటికి వెళ్లి విచారణ చేసి తేడాలు ఉంటే పరిశీలించి అవసరం మేరకు ఫారం 6, 7, 8లను ఓటరుకు అందించాలని సూచించారు. తాళం వేసిన ఇళ్లను మూడుసార్లకు తగ్గకుండా సందర్శించాలని చెప్పారు. కార్యక్రమంలో కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలకు సర్వం సిద్ధం


