మిగులు భూమి కథ తేల్చండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం అనంతపురం–చైన్నె జాతీయ రహదారి పక్కన కందుకూరు పొలం 430–2 సర్వే నంబరులోని మిగులు భూమి కథ తేల్చాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. రూ. 2.20 కోట్ల విలువ చేసే 85 సెంట్ల భూమిని అధికార పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు ఆక్రమించి మామిడి మొక్కలు నాటిన వైనంపై ‘సాక్షి’లో గురువారం ‘మిగులు భూమిని మింగేద్దామని’ శీర్షికన వెలువడిన కథనం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ ఆనంద్ స్పందించి విచారణకు రెవెన్యూ, డ్వామా అధికారులను ఆదేశించారు. కూడేరు మండలం అరవకూరుకు చెందిన సూరి అనే వ్యక్తి ఈ భూమిని ఆక్రమించి ఉపాధి హామీ పథకం కింద మామిడి మొక్కలు నాటాడనే ఆరోపణలపై డ్వామా పీడీ సలీంబాషా వద్ద టెక్నికల్ అసిస్టెంట్ ఓబులేసు వివరణ ఇచ్చారు. సదరు సర్వే నంబరులో ఉపాధి హామీ పథకం కింద పనులు చేయలేదని పేర్కొన్నారు. ఉపాధి పథకం కింద ఎలాంటి బిల్లులూ పెట్టలేదని టెక్నికల్ అసిస్టెంట్‌తో పాటు కృష్ణంరెడ్డిపల్లికి చెందిన తిరుతపయ్య స్పష్టం చేశారు. మరోవైపు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో రూరల్ తహసీల్దార్ మోహన్‌కుమార్ స్పందించారు. 85 సెంట్లు మిగులు భూమిగానే ఉందని స్పష్టం చేశారు. సంబంధిత వీఆర్‌ఓతో మాట్లాడారు. భూమిలో మొక్కలు నాటిన వ్యక్తికి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఆయన వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మోహన్‌కుమార్ పేర్కొన్నారు.


