కార్మికుల జీవితాలతో చెలగాటం
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రిలో రోజు రోజుకూ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. అభద్రతాభావంతో పారిశుధ్య కార్మికులు, వేతనంలో కోత విధిస్తున్నారంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన బాట పడుతుండడంతో రోగులకందే సేవల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఇంత జరుగుతున్నా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి అధికారులు సైతం ఏజెన్సీలకు వంత పాడుతూ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆనంద్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని ఆస్పత్రి వర్గాలంటున్నాయి.
అనుయాయులకు అవకాశం..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏనాడూ కార్మికులను ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్లు పైబడిన వారిని, డిగ్రీ లేని సూపర్‌వైజర్లను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సర్వజనాస్పత్రి, సూపర్ స్పెషాలిటీ, వైద్య కళాశాలలో 240 మంది వరకు పారిశుధ్య కార్మికులు, 21 మంది సూపర్‌వైజర్లున్నారు. వీరంతా ఉండగానే నూతన ఏజెన్సీ కొత్త వారిని చేర్చుకుంటోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే 30 మందికిపైగా సూపర్‌వైజర్లు, శానిటేషన్ సిబ్బందిని గుట్టుచప్పుడు కాకుండా విధులకు పురమాయించారు. మరికొందరిని తీసుకునేందుకు ఏజెన్సీ నిర్వాహకులు చూస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి అధికారులు మాత్రం తమకు పని మాత్రమే కావాలని, పారిశుధ్య కార్మికుల గురించి అవసరం లేదని బహిరంగంగా చెబుతూ ఏజెన్సీ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఆందోళనలు ఉధృతం..
సర్వజనాస్పత్రిలో సెక్యూరిటీ నిర్వహణ బాధ్యత తీసుకున్న నూతన ఏజెన్సీ నిర్వాహకులు సిబ్బంది పొట్టకొడుతున్నారు. జీఓ 138 ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్‌ఐ కలుపుకుని కార్మికులకు రూ.18,600 ఇవ్వాల్సి ఉంటే ఇటీవల రూ.12 వేలు మాత్రమే కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో తమకు జరుగుతున్న అన్యాయంపై గత కొన్ని రోజులుగా కార్మికులు సెక్యూరిటీ విధులను పక్కన పెట్టి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు నిత్యం బైఠాయిస్తున్నారు. పలుమార్లు నూతన శానిటేషన్ ఏజెన్సీ నిర్వాహకులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికే నూతన ఏజెన్సీ నిర్వాకంతో శానిటేషన్ అధ్వానంగా మారిన నేపథ్యంలో తాజాగా పారిశుధ్య కార్మికుల ఆందోళనలతో ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా తయారైంది.
అభద్రతాభావంలో జీజీహెచ్
పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది
నూతన ఏజెన్సీ విధానాలతో
రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం


