ట్యాబ్‌లు ఏవీ లోకేష్?
● నవంబర్ వచ్చినా ఎదురుచూపులు
రాయదుర్గం: కూటమి ప్రభుత్వంలో పేద పిల్లలకు సర్కారు విద్య భారమవుతోంది. సాంకేతిక బోధన అందని ద్రాక్షగా మారింది. దేశానికే దిక్సూచిగా విద్యా విధానాన్ని తీర్చిదిద్ది పేదింటి పిల్లలకు డిజిటల్ విద్యావకాశాలు కల్పిస్తూ గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ట్యాబ్‌లను పంపిణీ చేయగా.. కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్నే అటకెక్కించింది. నేడు నవంబర్ వచ్చినా ట్యాబ్‌ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,249, ప్రాథమికోన్నత 59, ఉన్నత పాఠశాలలు 361, హయ్యర్ సెకండరీ 84 ఉన్నాయి. వీటిలో 2,10,540 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో ఏటా ఒక్కో ట్యాబ్‌కు రూ.32 వేలు ఖర్చుచేసి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలు సమకూర్చి డిజిటల్ క్లాస్ రూమ్‌లో బోధన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగంపై శీతకన్ను వేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గతంలో నాడు–నేడు పథకం కింద చేపట్టిన పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపో యాయి. గోరుముద్ద పథకం ఘోరంగా తయారైంది. భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నాణ్యత సరిగా ఉండడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో పేద పిల్లలపై దృష్టి సారించాలని జిల్లాలోని అన్ని వర్గాలు కోరుతున్నాయి.
పథకాలన్నీ కనుమరుగు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు పెద్దపీట వేశారు. విద్యతోనే పేదల తలరాత మారుతుందని భావించి ఎన్నో రకాల పథకాలు అమలు చేశారు. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం నేటికీ ట్యాబ్‌ల పంపిణీ చేపట్టలేదు. పథకాలు కూడా కనుమరుగయ్యాయి.
– ప్రశాంత్‌యాదవ్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు, రాయదుర్గం


