ప్రాణాన్ని బలిగొన్న ఓవర్‌టేక్
● మరో ముగ్గురికి తీవ్రగాయాలు
గుంతకల్లు రూరల్: టిప్పర్ డ్రైవర్ ఓవర్‌టేక్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో ముగ్గురిని తీవ్రగాయాలపాలు చేసింది. తిమ్మాపురం గ్రామం వద్ద జరిగిన ఈ ఘటన కూలీల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. గుంతకల్లు రూరల్ ఎస్‌ఐ రాఘవేంద్రప్ప, క్షతగాత్రులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దంచర్ల గ్రామానికి చెందిన పది మంది వ్యవసాయ కూలీలు శనివారం తిమ్మాపురం– దోనిముక్కల గ్రామాల మధ్య గల రైతు రంగన్న పొలంలో కరివేపాకు పంట తొలగించేందుకు ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకొని మధ్యాహ్నం ఆటోలో తిరుగుపయనమయ్యారు. అర కిలోమీటర్ దూరం ప్రయాణించగానే తిమ్మాపురం వద్ద వెనకాలే వస్తున్న టిప్పర్ వారి ఆటోను ఓవర్‌టేక్ చేసేందుకు ముందుకు వచ్చింది. అదే సమయంలో ఎదురుగా గొర్రెల మంద రావడంతో టిప్పర్ డ్రైవర్ దానిని తప్పించేందుకు స్టీరింగ్‌ను కొద్దిగా ఆటోవైపు తిప్పాడు. ఆ సమయంలో టిప్పర్ ఎక్కడ తగులుతుందోనన్న భయంతో డ్రైవర్ జనార్దన్ ఆటోను పక్కకు తిప్పాడు. అంతే ఆదుపు తప్పిన ఆటో ఒక్కసారిగా బోల్తా పడి తిరిగి యథాస్థానంలో నిల్చుంది. ఆటోలో ఉన్న కూలీలందరూ ఎగిరిపడ్డారు. ప్రమాదంలో దంచర్ల గ్రామానికి చెందిన పెద్ద పుల్లన్న (45) అనే వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. రంగస్వామి, యల్లప్ప, రామాంజనేయులు అనే మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా మృతుడు పెద్ద పుల్లన్నకు భార్య సువర్ణ, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద పుల్లన్న మరణవార్త విని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్‌ఐ రాఘవేంద్రప్ప పరిశీలించి, కేసు నమోదు చేశారు.


