నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
వైఎస్సార్ సీపీ ర్యాలీ వాయిదా
● నవంబర్ 4వ తేదీ నిర్వహణ
● పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’లో భాగంగా అన్ని నియోజకవర్గ స్థాయిల్లో ఈ నెల 28న తలపెట్టిన ర్యాలీ కార్యక్రమం వాయిదా పడినట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. తుపాన్ దృష్ట్యా కార్యక్రమాన్ని నవంబర్ 4కి వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు.
అమరవీరులకు
అండగా ఉంటాం
అనంతపురం సెంట్రల్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ పి. జగదీష్ భరోసా ఇచ్చారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఎస్పీ ఆదేశాలతో ఆదివారం జిల్లాలో అమరవీరుల ఇళ్లకు పోలీసు అధికారులు వెళ్లి బాధిత కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన హనుమంతు రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగంలో జూనియర్ కమాండోగా పనిచేస్తూ 2008లో ఒడిశా బార్డర్‌లో అసువులు బాశారు. ఆయన భార్య స్రవంతి పోలీసు శాఖలో పనిచేస్తూ స్థానిక ఆదిమూర్తినగర్‌లో నివాసముంటోంది. ఎస్పీ ఆదేశాలతో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్ వారి ఇంటికి వెళ్లి హనుమంతు చిత్రపటానికి నివాళులర్పించారు. ఏ ఇబ్బందులున్నా తెలి యజేయాలని, పోలీసుశాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే టూటౌన్ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తూ ఈ ఏడాది జనవరి 17న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నారాయణ నాయక్ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐలు శ్రీకాంత్, ఆర్‌ఐ పవన్‌కుమార్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్, గాండ్ల హరినాథ్, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్ టోర్నీలో జిల్లా బాలికల సత్తా
గోపాలపట్నం: విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నంలో జరిగిన టేబుల్ టెన్నిస్ టోర్నీలో జిల్లా బాలికలు సత్తా చాటారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14 బాలికల విభాగంలో జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. అండర్–17 బాలికల విభాగంలో జిల్లా జట్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. విజేతలను అధికారులు, కోచ్‌లు, ఉపాధ్యాయులు అభినందించి జ్ఞాపికలు అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక


