ఖైదీలకంటే అధ్వానంగా బతుకుతున్నాం
విడపనకల్లు: తమను ఓ గదిలో ఉంచి కనీసం అన్నపానీయాలు కూడా ఇవ్వకుండా వార్డెన్ వేధింపులకు గురి చేస్తోందని, ఖైదీలకంటే అధ్వానంగా బతుకుతున్నామని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడి ఎదుట ఆదర్శ పాఠశాల విద్యార్థినులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆదివారం ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ హరిప్రసాద్‌యాదవ్ విడపనకల్లు ఆదర్శ పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో వార్డెన్ సరస్వతి దురాగతంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థినులను హాస్టల్‌లో ఉంచి బయట తాళం వేసి ఉండడం గమనించిన వెంటనే వార్డెన్‌కు ఫోన్ చేసి, మాట్లాడారు. విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా హాస్టల్ తనిఖీ చేయడానికి వచ్చానని తెలపగానే ‘నువ్వు ఎవరైతే నాకేంటి, నేను ఉన్నప్పుడు రా’ అంటూ సరస్వతి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు. దీంతో కంగుతిన్న డాక్టర్ హరిప్రసాద్ యాదవ్ గేటు బయటి నుంచే విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో నిత్యావసర సరుకులు బయటి మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు బహిర్గతమైంది. వార్డెన్ భర్త మంత్రి పయ్యావుల కేశవ్‌కు ముఖ్య అనుచరుడిగా ఉండటం వల్ల ఆమె నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపించారు. విచారణలో వెల్లడైన అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు హరిప్రసాద్ యాదవ్ తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడి ఎదుట వాపోయిన ఆదర్శ పాఠశాల విద్యార్థినులు


