అమరు వీరుల త్యాగాలే స్ఫూర్తి
అనంతపురం సెంట్రల్: విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని పోలీసు కార్యాలయ ఆవరణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఐజీతో పాటు కలెక్టర్ ఏ. ఆనంద్, ఎస్పీ పి. జగదీష్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథులుగా హాజరై సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఐజీ షిమోషి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు 24 గంటలూ పోలీసులు శ్రమిస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించడం అభినందనీయమని కలెక్టర్, ఎస్పీలను ప్రశంసించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసులు, రెవెన్యూ శాఖలు కీలకమని, ఈ రెండు శాఖలు కలిసి పనిచేస్తేనే శాంతిభద్రతల పరిరక్షణ సులభమవుతుందన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ పోలీసు అమరువీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసుల నిబద్ధత, త్యాగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అమర వీరుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రజలు పోలీసులకు సహకారం అందించి చట్ట వ్యతిరేక, అసాంఘిక, అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్‌రహర్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్‌బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేసులు, రవిబాబు, శ్రీనివాస్, ఎస్.మహబూబ్‌బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, జాఫర్, సుధాకర్‌రెడ్డి, హరినాథ్, లక్ష్మీనారాయణ, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, మినిస్టీరియల్ ఉద్యోగులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అమరు వీరుల త్యాగాలే స్ఫూర్తి


