గొడ్డలితో నరికి...
● భర్త చేతిలో హత్యకు గురైన వివాహిత
డి.హీరేహాళ్(రాయదుర్గం): కట్టుకున్న ఇల్లాలిపై అనుమానం పెంచుకున్న భర్త ఉన్మాదిగా మారి ఆమెను హతమార్చిన ఘటన డి.హీరేహాళ్ మండలం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన నాగమణి (36)కి 18 ఏళ్ల క్రితం డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామానికి చెందిన హనుమంతరాయుడుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇటీవల హనుమంతరాయుడు మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో అకారణంగా భార్యను తరచూ వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. దీపావళి పండుగ పూట మద్యం తాగేందుకు డబ్బు కావాలని భార్యను అడిగాడు. ఆ సమయంలో తన వద్ద డబ్బు లేదని ఆమె తెలపడంతో సోమవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య మెడపై గొడ్డలితో నరికాడు. ఘటనతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.


