బాబుకు కనువిప్పు కల్గించేందుకే ‘కోటి సంతకాలు’
● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి
కూడేరు/అనంతపురం అగ్రికల్చర్: సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టామని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. గురువారం అనంతపురంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్ అధ్యక్షతన ఉరవకొండ నియోజకవర్గంలోని మండలాల పరిశీలకులు, కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘విశ్వ’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడడం దుర్మార్గమన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధపడ్డారన్నారు. వైఎస్సార్ సీపీ పటిష్టత కోసం చురుగ్గా పని చేసే వారికే గ్రామ, అనుబంధ కమిటీల్లో చోటు కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 28న ఉదయం 9 గంటలకు ఉరవకొండలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు దేవేంద్ర, ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ దేవా, కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ మండల కన్వీనర్లు బైరెడ్డి రామచంద్రారెడ్డి, డొనేకల్లు రమేష్, సోమశేఖర్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వడ్డే గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్, పార్టీ నేతలు ముస్టూరు నరేష్, నాగేంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


