రైతుల ముసుగులో నయా దందా
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ శాఖలో కొందరు అధికారులు నయా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విత్తనం, ఎరువులు, పురుగు మందుల దుకాణదారులు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఓ వైపు వసూళ్లు కొనసాగిస్తూనే... మరోవైపు సరికొత్త ఎత్తుగడతో వసూళ్లకు ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ పార్టీ ముద్ర వేసి కొందరినే టార్గెట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రైతుల ముసుగులో వారే ఫిర్యాదులు ఇప్పించి సదరు దుకాణంలో తనిఖీలు చేయడం, చిన్నపాటి పొరపాట్లు గుర్తించడం, సరుకు సీజ్.. కేసు నమోదు.. లైసెన్సు రద్దు అంటూ బెదిరిస్తున్నట్లు తెలిసింది.జిల్లాలో డివిజన్, మండల స్థాయి అధికారుల వరకు కొందరు ఈ సరికొత్త ప్రణాళిక అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, పలువురు అసోసియేషన్ నాయకుల పాత్ర ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బదిలీల సమయంలో రూ. లక్షలు ఖర్చు చేసి పోస్టింగ్‌లు తెచ్చుకున్న కొందరు అధికారులే వసూళ్లకు తెరలేపినట్లు ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రధాన వనరుగా జిల్లా కేంద్రం..
జిల్లా వ్యాప్తంగా 800 వరకు దుకాణాలు ఉన్నాయి. అందులో అనంతపురం నగర పరిధిలోనే 250 దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఉండడంతో ప్రధాన ఆర్థిక వనరుగా నగరాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం రైతుల ముసుగులో టార్గెట్ చేసిన దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, మందులు కొనిపించడం.. తర్వాత బిల్లులు ఇవ్వలేదని, వేరే కంపెనీ సరుకు ఇచ్చారని, దిగుబడులు రాలేదని... ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేయించి తనిఖీలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.ఇటీవల గార్లదిన్నె, కల్లూరు, అనంతపురంలో కొందరు వ్యక్తులను టార్గెట్ చేసి వారి దుకాణాల్లో తనిఖీలు చేశారు. చిన్నపాటి తప్పిదాలను బూచిగా చూపించి పెద్ద ఎత్తున వసూళ్లు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే కొంత మొత్తం చేతులు మారినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఫిర్యాదులు చేయించడం కోసం కొందరు రైతులను దళారులుగా మార్చినట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది దుకాణదారులు లబోదిబోమంటున్నారు. ప్రతి పనికీ, సంతకానికి రేటు నిర్ణయించి మరీ దండుకుంటున్న అధికారులు నేడు కుట్రపూరిత చర్యలకు దిగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నిషేధిత సరుకు అమ్ముతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరి షాపుల వైపు చూసే పరిస్థితే తమకు లేదని అధికారులే చెబుతుండటం విశేషం.
కొందరు వ్యవసాయాధికారుల కక్కుర్తి
తామే ఫిర్యాదు ఇప్పించి
దుకాణాల్లో తనిఖీలు
సీజ్, కేసులంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు ప్లాన్


