చంద్రబాబు ప్రభుత్వ మెడలు వంచుదాం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో 16 నెలలుగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 28న చేపట్టనున్న ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్లను గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇందులో మేధావులు, విద్యార్థులు, కళాకారులు, రచయితలు, ప్రజాసంఘాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈనెల 28న 10.30 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ దగ్గరున్న అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై ఆర్డీఓ ఆఫీసు వరకు కొనసాగుతుందని తెలిపారు.
ప్రభుత్వ ఆస్తుల నిలువుదోపిడీకి స్కెచ్..
కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, వేధింపులు రాజ్య మేలుతున్నాయని ‘అనంత’ దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ ఆస్తులను నిలువుదోపిడీ చేసేందుకు భారీ స్కెచ్ వేశారన్నారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిందని, అప్పట్లోనే అందులో 7 కళాశాలలు పూర్తి కాగా మిగతా 10 కళాశాలల నిర్మాణాలు 30 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. నేడు వాటిని పీపీపీ అంటూ ప్రైవేటీకరణ చేస్తుండటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలా చేస్తే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంద న్నారు. పేద వర్గాలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపడుతున్నట్లుగానే జిల్లాలో కూడా 7 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీ కరణ ఆపే ఉద్యమంలో అన్ని వర్గాలూ పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, అనంత చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, శింగనమల, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బీసీ రమేష్‌గౌడ్, వెన్నం శివారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనిల్‌కుమార్ గౌడ్, నగర కమిటీ అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు బాకే హబీబుల్లా, సోషియల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబాసలాం, మేధావుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, కార్పొరేటర్లు శేఖర్‌బాబు, శ్రీనివాసులు, రహంతుల్లా, ఇసాక్, నాయకులు ఫయాజ్, చింతకుంట మధు, కుళ్లాయిస్వామి, రామచంద్ర, దాదాపీర్, నాగార్జునరెడ్డి, మైను తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాల్సిందే
పీపీపీని నిరసిస్తూ ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి


