డబుల్ రిజిస్ట్రేషన్లపై సీఎంకు ఫిర్యాదు
అనంతపురం టౌన్: ఫేక్ రిజిస్ట్రేషన్లతో ఇతరుల స్థిరాస్తులను లాక్కొవాలని చూస్తే కుదరదని, ఈ అంశంపై బాధితులను బెదిరించినా ఊరుకునేది లేదని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా అనంత నగరంలో ఎలాంటి భూ వివాదాలు, భూ కబ్జాలు లేవన్నారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో చోటామోటా నాయకులు ఫేక్ రిజిస్ట్రేషన్లతో అత్యంత విలువైన భూములను కబ్జా చేస్తూ బాధితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసేందుకు ఎంత వరకై నా పోరాటం సాగిస్తామన్నారు. నగరంలో జరుగుతున్న భూకబ్జాల పర్వాన్ని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగానే నగరంలో భూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు లేఖ రాసినట్లు వివరించారు. నగర ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులే అన్యాయాలకు తెరదీయడం బాధాకరమన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వాయిదా
ఈ నెల 28న నిర్వహించాలనుకున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నవంబర్ ఆఖరుకు వాయిదా వేస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి తెలిపారు. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా సినీరంగానికి సేవలు అందించిన కళాకారులను, సినీనటులను సత్కరించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సినీ రంగానికి సేవలందించిన రాయలసీమ కళాకారులను పార్టీలకు అతీతంగా సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.
ఒకరి స్థిరాస్తిని లాక్కొంటామంటే కుదరదు
ఫేక్ రిజిస్ట్రేషన్లతో బాధితులను బెదిరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి


