భూ పరిహారంలో అన్యాయం
తాడిపత్రి రూరల్: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన తమకు తక్కువ పరిహారం నిర్ణయించడం సమంజసం కాదని, తక్షణమే పరిహారాన్ని మరింత పెంచాలంటూ ఆర్టీఓ కేశవనాయుడుకు పలువురు రైతులు విన్నవించారు. తాడిపత్రి – పుట్లూరు మార్గంలో రైల్వే బ్రిడ్జి ఏర్పాటుకు 3.79 ఎకరాల భూసేకరణ అంశంపై గన్నెవారిపల్లి సచివాలయం–3లో మంగళవారం రైతులతో తహసీల్దార్ సోమశేఖర్‌తో కలసి ఆర్డీఓ సమావేశమయ్యారు. రైతు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పరిహారం నిర్ణయించకుండా వ్యవసాయ భూమి పేరుతో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. వ్యవసాయ భూమిని కమర్షియల్‌గా కన్వర్షన్ చేసుకోనంత మాత్రాన రైతులకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. భూసేకరణలో నిర్ణయించిన ఽపరిహారం మొత్తం ఏ రైతుకూ ఇష్టం లేదన్నారు. పరిహారం ధర పెంచేలా చర్యలు తీసుకోవాలని మరో రైతు శ్రీధర్‌నాయుడు సూచించారు. ఆర్డీఓ కేశవనాయుడు మాట్లాడుతూ.. పరిహారం తక్కువగా నిర్ణయించారని కోర్టుకు వెళ్లడం వల్ల పనులు నిలిచిపోవని, ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జికి ఎలాంటి అడ్డంకులు సృష్టించాలన్నా ప్రయోజనం ఉండదన్నారు. భూసేకరణలో భాగంగా ఎకరాకు రూ.38లక్షలు నిర్ణయించామని, ఈ ధర ప్రకారం రైతులు అమోదం తెలిపితే పరిహారం అందజేస్తామని, తిరస్కరిస్తే వారి మొత్తం కోర్టులో డిపాజిట్ చేసి పనులు చేపడతామని హెచ్చరించారు.


