
శ్రీదేవికి మెమో
అనంతపురం రూరల్: మిషన్‌శక్తి– మిషన్ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఉరవకొండ సీపీడీఓ శ్రీదేవికి ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి చార్జ్‌మెమో జారీ చేశారు. మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహలో ఈ నెల 3న శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ అంశంలో ఐసీడీఎస్ పీడీ నాగమణిని అప్పట్లో ఉన్నతాధికారులు సస్సెండ్ చేశారు. అయితే శిశువు మృతికి అసలు కారకులపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఈ నెల 9న ‘పసివాడి ప్రాణం.. లెక్కలేని తనం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. స్పందించిన ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి కథనంలో పేర్కొన్న విధంగా మిషన్ వాత్సల్య జిల్లా కో ఆర్డినేటర్ బాధ్యతారాహిత్యాన్ని ప్రస్తావిస్తూ మెమో జారీ చేశారు. శిశుగృహలో ఉన్న పిల్లల భద్రత, సంక్షేమానికి చర్యలు తీసుకోవడం, ప్రత్యేక దత్తత ఏజెన్సీల పనితీరును పర్యవేక్షించడం, ఆసుపత్రిలో సంరక్షణ, పర్యవేక్షణ ప్రమాణాలు పాటించడంలో మిషన్ వాత్సల్య కో ఆర్డినేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫలితంగానే నవజాత శిశువు మృతి చెందినట్లుగా అభియోగాలు వచ్చాయని పేర్కొన్నారు. పదిరోజుల్లో సంజాయిషీ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, శిశువు మృతికి కారకులైన శిశుగృహ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడనున్నట్లు సమాచారం.