
వీడని మిస్సింగ్ మిస్టరీ
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కొడిమి దర్గా కొట్టాలుకు చెందిన 3వ తరగతి విద్యార్థి అదృశ్యంపై మిస్టరీ వీడలేదు. ఆరు రోజులైనా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చుట్టపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టినా లాభం లేకపోయింది.
ఏమి జరిగిందంటే..
కొడిమి పంచాయతీ పరిధిలోని దర్గా కొట్టాలుకు చెందిన వేణు, వెంకటలక్ష్మి దంపతులు కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. పేదరికం కారణంగా పెద్ద కుమారుడు ఈశ్వర్ చదువుకోలేకపోయాడు. ఉరవకొండలోని గిరిజన గురుకుల పాఠశాలలో రెండో కుమారుడు నరసింహ 6వ తరగతి, మూడో కుమారుడు రామాంజనేయులు 3వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 11న ఇద్దరూ గురుకులానికి బయలుదేరారు. దీంతో ఇద్దరినీ పిలుచుకుని అనంతపురానికి వచ్చిన ఈశ్వర్... వారికి కావాల్సిన సామగ్రిని ఇప్పించి బస్సులో ఉరవకొండకు బయలుదేరారు. రామాంజనేయులు తాను ఇంటికి వెళ్తానంటూ మారం చేస్తూ ఏడుస్తుండడంతో బస్సు రాచానపల్లికి చేరుకోగానే దింపేసి ఈశ్వర్, నరసింహ ఉరవకొండకు వెళ్లిపోయారు.
రామాంజనేయులు ఎక్కడ?
బస్సు దిగిన రామాంజనేయులు సమీపంలోని తమ ఇంటికి వెళ్లకుండా సిండికేట్‌నగర్‌కు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 3వ తరగతి అంటే పదేళ్లలోపు వయసు ఉంటాది. ఒంటరిగా బయట తిరిగే అంత జ్ఞానం కూడా ఉండదు. అలాంటి పిల్లాడు ఎవరి వద్దకు వెళ్లాడు, ఎక్కడికి వెళ్లాడో అంతుచిక్కడం లేదు. ఆరు రోజులు దాటినా ఆచూకీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో బాలుడి కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సైతం ఆ దిశగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఉరవకొండకు వెళ్లి పాఠశాలకు వెళ్లి విచారించారు. తల్లిదండ్రులు కూడా కొడిమి, రాచానపల్లి పంచాయతీలతో పాటు అనంతపురం నగరంలో ఆస్పత్రి, ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఆరా తీశారు. కాగా, బాలుడి మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు అనంతపురం రూరల్ సీఐ శేఖర్ అంటున్నారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 94407 96811 (సీఐ)కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆరు రోజులైనా లభ్యం కాని బాలుడి ఆచూకీ
చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టినా ఫలితం శూన్యం