
రైతు కష్టాలు పట్టని అసమర్థ ప్రభుత్వం
● వైఎస్సార్‌సీపీ రైతువిభాగం నాయకులు
ఉరవకొండ: ప్రత్యామ్నాయ పంటల సాగు కింద సబ్సిడీతో పప్పుశనగ విత్తనాన్ని రైతులకు పంపిణీ చేయలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం ఉరవకొండలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రైతువిభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకలసిద్ధార్థ్, రూరల్ సమన్వయకర్త రాయంపల్లి ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడారు. రబీ సీజన్ కింద జిల్లాలో పప్పుశనగను ఉరవకొండ అత్యధికంగా 40 వేల హెక్టార్లలో పప్పుశనగను రైతులు సాగు చేస్తుంటారన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరుకూ రైతులకు రాయితీతో పప్పుశనగ విత్తనం పంపిణీ చేయలేదన్నారు. కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు రైతుల కష్టాలు పట్టడం లేదన్నారు. రాయితీ విత్తన పంపిణీపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో అధిక ధరతో విత్తనాలను కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. జిల్లాలో గత ఖరీఫ్, రబీతో పాటు ప్రస్తుత ఏడాది ఖరీఫ్, రబీకు సంబందించి విత్తన ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, ఫలితంగా విత్తనం అందక పోవడంతో రైతులపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికై నా ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ చొరవ తీసుకుని విత్తన కంపెనీలకు బకాయిలు చెల్లించి, సకాలంలో రైతులకు విత్తనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బసవరాజు, పార్టీ మండల సమన్వయకర్త ఓబన్న, సుద్దాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.