
ఉపాధి అక్రమాలపై విచారణ చేపట్టండి
● డ్వామా పీడీకి మాజీ ఎంపీ రంగయ్య వినతి
అనంతపురం టౌన్: కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ డ్వామా పీడీ సలీంబాషాకు మాజీ ఎంపీ రంగయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం సలీంబాషాను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. కంబదూరు మండల వ్యాప్తంగా ఉపాధి పనులు చేయకుండానే టీడీపీ నాయకులతో ములాఖత్ అయిత ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పనులకు రాని కూలీల పేర్లను సైతం మస్టర్లలో నమోదు చేసి బిల్లులు పెద్ద ఎత్తున డ్రా చేశారన్నారు. మెట్ట భూముల్లో ఉద్యాన పంటల సాగులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. నిధులను కొల్లగొట్టిన వారి నుంచి సొమ్ము రివకరీ చేయాలని, లేకుంటే డ్వామా కార్యాలయం ఎదుట ఆందోళ కార్యక్రమాలు చేపడతామని హెచ్చ రించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు భీమేష్, గంగాధర్ తదితరులు ఉన్నారు.
వాటర్ షెడ్ పనులు వేగవంతం చేయండి
వాటర్ షెడ్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డ్వామా పీటి సలీంబాషా ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన వాటర్ షెడ్ పనులపై అధికారులతో శుక్రవారం డ్వామా కార్యాలయంలో ఆయన సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 7 ప్రాజెక్టుల్లో చేపట్టనున్న పనులు రానున్న 3 నెలల్లో 100 శాతం పూర్తి కావాలన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 848 పనులు జరుగుతున్నాయని, వీటిలో 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులు సైతం సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ ఏపీడీ సుధాకర్‌రెడ్డి, కృష్ణచైతన్యతో పాటు నియోజకవర్గ ఏపీడీలు పాల్గొన్నారు.