
బియ్యం పంపిణీలో డీలర్ చేతివాటం
● తక్కువ వేస్తున్నాడంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ నిరసన
కళ్యాణదుర్గం: డీలర్ చేతివాటం ప్రదర్శించి తక్కువ తూకంతో బియ్యం వేస్తున్నాడంటూ కళ్యాణదుర్గంలోని వడ్డేకాలనీకి చెందిన లబ్ధిదారురాలు సల్లా లక్ష్మీదేవి వాపోయింది. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటరిగానే నిరసన వ్యక్తం చేసింది. వివరాలు.. సల్లా లక్ష్మీదేవికి ప్రభుత్వం అంత్యోదయ కార్డు (2803192003) జారీ చేసింది.నిబంధన మేరకు ఆమెకు ప్రతి నెలా 35 కిలోల బియ్యం అందాలి. అయితే వడ్డే కాలనీలో ఉన్న రేషన్ షాప్ (12223070) డీలర్ ప్రతి నెలా ఆమెతో వేలిముద్ర వేయించుకుని 22 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నాడు. పలుమార్లు అడిగినా వచ్చే నెలలో వేస్తానంటూ నమ్మబలికేవాడు. ఈ విషయంగా మనస్తాపం చెందిన బాధితురాలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేసింది. అనంతరం తహసీల్దార్ భాస్కర్‌ను కలసి తన గోడు వెల్లబోసుకుంది. స్పందించిన తహసీల్దార్ వెంటనే సదరు రేషన్ షాపును పరిశీలించాలని వీఆర్వో గంగాధర్‌ను ఆదేశించారు. వీఆర్వో తనతో పాటు బాధితురాలిని పిలుచుకెళ్లి న్యాయపరంగా ఆమెకు దక్కాల్సిన 35 కిలోల బియ్యాన్ని ఇప్పించారు.