
ప్రభుత్వానికి నివేదించాం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామ సమీపంలో ఏర్పాటైన జగనన్న లేఅవుట్ ఇది. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో ఇళ్లు లేని 8 వేల మంది నిరుపేదలకు ఇక్కడ ప్రభుత్వమే స్థలం మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. జగన్ హయాంలోనే 70 శాతానికి పైగా పనులు చేపట్టారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో బిల్లులు మంజూరు
చేయకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి.
అనంతపురం టౌన్: కూటమి ప్రభుత్వంలో కొత్త ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా కొత్తగా ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు. ఎన్‌టీఆర్ గృహ పథకానికి ఇప్పటికే 30 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అదిగో.. ఇదిగో అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు కాలయాపన చేస్తుండగా.. పేదలు మాత్రం గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో 76 వేల ఇళ్లు..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో ఇల్లు మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 426 జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రూరల్ పరిధిలో ఒకటిన్నర సెంటు, అర్బన్ పరిధిలో ఒక సెంటు స్థలాన్ని కేటాయించి పట్టాలను అందించడంతో పాటు పక్కా ఇంటిని మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించారు. సొంతంగా నిర్మాణ పనులు చేపట్టిన లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు బిల్లులను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. అప్పట్లోనే జిల్లాలో రూ.800 కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశారు.
చిదిమేసిన కూటమి ప్రభుత్వం..
పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం చిదిమేసింది. కొత్త ఇళ్లు మంజూరు చేయకపోగా నిర్మాణాల్లో ఉన్న వాటిపై సైతం కక్ష గట్టింది. బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం చేయడంతో కాంట్రాక్టు సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి. చంద్రబాబు కుట్రలతో జగనన్న కాలనీల్లో చాలా ఇళ్లు పునాది దశలోనే ఉన్నాయి.
కొత్త ఇళ్ల మంజూరు విషయమై ప్రభుత్వానికి నివేదికలు పంపాం. వచ్చే నెలలో కొత్త ఇళ్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆదేశాలు రాగానే లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపడతాం.
– శైలజా, గృహనిర్మాణ సంస్థ పీడీ
పేదలపై సర్కారు కక్ష
కొత్త ఇళ్ల మంజూరులో నిర్లక్ష్యం
జిల్లాలో 30 వేల మంది నిరీక్షణ
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
76 వేల గృహాలు మంజూరు
అప్పట్లో రూ.800 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ సర్కారు
కొడిమి గ్రామ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ ఇది. ఇక్కడ అనంతపురం రూరల్, అర్బన్ ప్రాంతాల నిరుపేదలు దాదాపు 4 వేల మందికి గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వ కుట్రల కారణంగా పనులు ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఇదిగో ఇలా ఇళ్ల నిర్మాణాలు ముళ్ల కంపలతో నిండిపోయాయి. ఈ రెండు చోట్లే కాదు.. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. కూటమి సర్కారు కొత్త ఇళ్లు మంజూరు చేయకపోగా నిర్మాణాల్లో ఉన్న వాటిపై సైతం కక్ష కట్టడంతో పేదల సొంతిల్లు ‘కల’గానే మారిపోయింది.

ప్రభుత్వానికి నివేదించాం