
పప్పుశనగ విత్తనం అందేనా?
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రబీ ప్రధాన పంట పప్పుశనగ సాగు ప్రారంభమైంది. అక్కడక్కడా కురిసిన తేలికపాటి జల్లులకే కొందరు రైతులు ముందస్తు సాగుకు ఉపక్రమించారు. ఈ నెల 15 నుంచి నవంబర్ మొదటి వారం వరకు పప్పుశనగ సాగుకు మంచి అదనుగా రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే గతి తప్పిన వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ మాదిరిగానే రబీలో కూడా కొందరు రైతులు ముందుగానే పంట సాగు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉరవకొండ, బెళుగుప్ప ప్రాంతాల్లో విత్తుకోవడం మొదలు పెట్టారు. మంచి వర్షపాతం నమోదైతే 25 మండలాల పరిధిలో నెలాఖరులోపు 60 నుంచి 70 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
నోరు మెదపని మంత్రి కేశవ్
రాయితీ విత్తన పప్పుశనగ విషయంలో కూటమి సర్కారు స్పష్టత ఇవ్వకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే జిల్లాకు 28 వేల క్వింటాళ్ల నుంచి 14 వేల క్వింటాళ్లకు కుదించారు. 40 శాతం ఉన్న రాయితీని 25 శాతానికి పరిమితం చేసి రైతుల్లో నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దని సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రబీ మొదలై 10 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడం గమనార్హం. గతంలో ఈ పాటికి విత్తన పంపిణీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత జిల్లా రైతులకు.. మరీ ముఖ్యంగా పప్పుశనగ సాగు ఎక్కువగా చేసే ఉరవకొండ రైతులకు కూడా విత్తనం ఇవ్వలేని దుస్థితిలో ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది, ఈ ఖరీఫ్‌లో విత్తన వేరుశనగ, పప్పుశనగ పంపిణీ చేసిన సరఫరా చేసిన ఏజెన్సీలకు రూ.74 కోట్ల బిల్లుల విడుదలలో సర్కారు జాప్యం చేయడంతో రైతులకు విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు.
అక్కడక్కడా సాగు ప్రారంభం
రాయితీ విత్తనంపై మాత్రం
ఇప్పటికీ స్పష్టత కరువు