
గుండు జారి.. గుండె అదిరి
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం నుంచి తుంపర్లు పడ్డాయి. ఈశాన్యం నుంచి నైరుతి దిశగా గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రాయదుర్గంటౌన్: పట్టణంలోని గౌడ జగనన్న హౌసింగ్ లేవుట్‌లోని ఓ ఇంటిపైకి ఓ భారీ సైజు గుండురాయి దూసుకొచ్చింది. గుండు రాయి ధాటికి ఇంటి వద్ద బాత్ రూముతో పాటు ప్రహరీ దెబ్బతింది. ఇంటికి సమీపంలో కొండ ఉంది. ఇటీవల అక్కడి ఎర్రమట్టిని కొందరు యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. గుండురాయి ఉన్న స్థలంలో కూడా మట్టి తరలించడంతోనే కిందకు దొర్లినట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయినా కాలనీలో వీధిదీపాలు, నీటి వసతి లేక నివాసం ఉండడం లేదని బాధితుడు మన్సూర్ అహ్మద్ తెలిపాడు.
ఖతర్‌లో ఉద్యోగాలకు
దరఖాస్తుల స్వీకరణ
అనంతపురం రూరల్: ఖతర్‌లోని దోహాలో హోం కేర్ నర్స్ ఉద్యోగాలకు ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్దులు, పార్సీలు, జైన్ల మతాల్లోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఈడీ జగన్‌మోహన్‌రావు తెలిపారు. 21 నుంచి 40 సంవత్సరాల్లోపు వయస్సు ఉండాలన్నారు. బీఎస్సీ జీఎన్‌ఎం, నర్సింగ్ పూర్తి చేసి, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారానికి 9849901138, 9949910415, 9160775077 నంబర్లలో సంప్రదించాలన్నారు.