
రైలు పట్టాలపై మృత్యుఘోష!
● పెరుగుతున్న ఆత్మహత్యలు, ప్రమాదాలు
● ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సగటున 200 కేసుల నమోదు
చిలమత్తూరు మండలానికి చెందిన కమలాకర్ (40) గత ఆదివారం రాత్రి కాచిగూడకు వెళ్లేందుకు సిద్ధమై హిందూపురంలో రైలు ఎక్కారు. ధర్మవరం రైల్వేస్టేషన్ రాగానే వాటర్ బాటిల్, టిఫిన్ కొనుగోలు చేసేందుకు దిగాడు. ఈలోపు రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించి అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతపురం – తాటిచెర్ల మార్గంలోని నేషనల్ హైవే బ్రిడ్జి కింద గత సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసినా... ఆ తర్వాత విచారణలో మృతుడిని అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రవికుమార్‌గా గుర్తించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు తాళలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారణ అయింది.
రాయదుర్గం: రైలు పట్టాలపై జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవగాహన లోపం, నిర్లక్ష్యం, క్షణికావేశం కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఉమ్మడి అనంత జిల్లా పరిధిలో గుంతకల్లు రైల్వే జోన్ కింద తొమ్మిది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో సగటున ఏడాదికి 200 కేసులు నమోదుకాగా, ఇందులో 80 శాతానికి పైగా పైగా మరణాలు, 20 శాతం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకున్నవారు ఉన్నారు. గుంతకల్లు నుంచి బళ్లారి మీదుగా ఓబుళాపురం, సోములాపురం, రాయదుర్గం దాటుకుని కర్ణాటకలోని బెంగళూరుకు ఓ లైను ఉండగా, రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం మీదుగా కదిరిదేవరపల్లి వరకూ మరో లైను, గుంతకల్లు నుంచి గుత్తి మీదుగా అనంతపురం, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, హిందూపురం వరకు మరో లైను ఉంది. వీటి పరిధిలో నిత్యం ఏదో ఓ చోట మృతదేహాలు లభ్యమవుతున్నాయి. పట్టాలు దాటుతూ కొందరు, రైలు నుంచి జారి పడి ఇంకొందరు, క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే వారు మరికొందరు ఉంటున్నారు. కొన్ని మృతదేహాలు గుర్తించగా, మరిన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉంటున్నాయి. ఇలాంటి అనాథ మృతదేహాలకు రైల్వే పోలీసులే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
సూచనలు పాటించాలి
రైల్వే ప్రయాణికులు స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య పరుస్తున్నాం. రైలు కదిలే సమయాన ఎక్కే ప్రయత్నం చేయరాదు. సరైన జాగ్రత్తలు, అప్రమత్తతతో వ్యవహరిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఒక్క క్షణం వారి కుటుంబం గురించి ఆలోచించాలి.
– చంద్ర, రైల్వే ఎస్‌ఐ, గుంతకల్లు

రైలు పట్టాలపై మృత్యుఘోష!

రైలు పట్టాలపై మృత్యుఘోష!