
కూడేరు సీఐని సస్పెండ్ చేయాలి
● లేకపోతే ఈ నెల 13న జిల్లా కేంద్రంలో ధర్నా
● మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టకుండా కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్న కూడేరు సీఐ రాజాని తక్షణమే సస్పెండ్ చేయాలని ఉరవకొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సీఐ రాజా పనితీరుపై గతంలోనూ ఎస్పీ జగదీష్ దృష్టికి తీసుకెళ్లామని, అయినా అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు కనుసన్నల్లోనే సీఐ రాజా పని చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను టీడీపీలోకి చేరాలని, లేకుంటే కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తామంటూ సీఐ బాహాటంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నారు. పోలీసు స్టేషన్‌ను సివిల్ పంచాయితీలకు కేంద్రీకృతం చేస్తూ.. నిందితులు, భూ కబ్జాదారులు, దౌర్జన్యకారులకు వంత పాడుతున్నారన్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితర నాయకులను దుర్భాషలాడడమే కాకుండా రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఇన్ని దౌర్జన్యాలు చేయడం కంటే పోలీసు స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మారిస్తే బాగుంటుందంటూ ఎస్పీ జగదీష్‌కు సూచించారు.
చేతనైతే హామీలు అమలు,
అభివృద్ధి చర్యలు చేపట్టాలి
మంత్రి కేశవ్ పెద్ద ఎత్తున జూదం ఆడిస్తున్నారని, ఇందులో పోలీసులకూ వాటా ఉందని విమర్శించారు. ఒక్క రోజైనా జూద గృహాలపై సీఐ దాడులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ సారా, తదితర వాటిని విక్రయిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబాల్లో ఉన్న కలహాలను ఆసరాగా చేసుకుని పోలీసుల సాయంతో టీడీపీలోకి చేర్చుకోవాలని చూడడం సరికాదన్నారు. చేతనైతే సూపర్‌సిక్స్ హామీల అమలు, ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకుని ప్రజలను ఆకట్టుకోవాలని కేశవ్‌కు హితవు పలికారు. కురుబ గోవిందుకు చెందిన 24 ఎకరాల భూమిలోకి వెళ్లకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తుంటే సీఐ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూడేరు సీఐను సస్పెండ్ చేయకపోతే ఈ నెల 13న జిల్లా కేంద్రంలో కూడేరు ప్రాంత ప్రజలతో కలసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. అనంతరం పలువురు బాధితులు మాట్లాడుతూ.. సీఐ రాజా దౌర్జన్యాలను వివరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, కూడేరు ఎంపీపీ నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మేరీనిర్మలమ్మ, నాయకులు పాల్గొన్నారు.