
ప్రజారోగ్యంతో చెలగాటమా?
● ఎక్సైజ్ పోలీసుస్టేషన్ వద్ద ధర్నాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు
గుంతకల్లు: విచ్ఛలవిడిగా కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజారోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.గాదిలింగేశ్వరబాబు (చిన్నబాబు), మున్సిపల్ మాజీ చైర్మన్ జింకల రామాంజనేయులు ధ్వజమెత్తారు. కల్తీ మద్యంను అరికట్టాలని, కల్తీ మద్యం సేవించి మృతి చెందిన బేల్దారి పెద్దన్న కుటుంబాన్ని ఆదుకోవాలంటూ గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆదేశాలతో గురువారం గుంతకల్లులోని రాజేంద్రనగర్‌లో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయం వద్ద పట్టణ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి పట్టణ కన్వీనర్ ఎండీఆర్ ఖలీల్ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. 1994 ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం అమలు చేస్తే.. ఆయనను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తివేసి విచ్ఛలవిడిగా విక్రయాలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. మద్యంను అంచెలంచెలుగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే నిర్వహిస్తూ బెల్ట్‌షాపులను పూర్తిగా కట్టడి చేసిందన్నారు. ప్రస్తుతం డబ్బు సంపదనే ధ్యేయంగా కల్తీ మద్యం వ్యాపారాన్ని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన బేల్దారి పెద్దన్న కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించడంతో పాటు బెల్ట్‌షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ ఎస్‌ఐ ఎం.వెంకటేశులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లింగన్న, జేసీబీ చాంద్‌బాషా, వార్డు ఇన్‌చార్జులు యల్లప్ప, సాయిపోగు వీరేష్, నాయడు, నాయకులు అబ్దుల్‌బాసిద్, రంగనాయకులు, మౌలా, బాబురావు, గోవిందునాయక్, జయరామిరెడ్డి, బావన్న, కసాపురం వంశీ, పవన్, నాగాంజనేయులు, యల్లన్న, నూర్‌నిజామి, ఆర్‌డీజీ బాషా, డ్యామ్‌వలి, ఖాసీమ్, సర్పంచులు నారాయణస్వామి, ఈసునాయక్, ఎంపీటీసీ రమేష్‌నాయక్, జి.శాంతిరాణి, సునీతబాయి పాల్గొన్నారు.