
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరుబాట
అనంతపురం కార్పొరేషన్: ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, తదితర వర్గాల పేద విద్యార్థులు వైద్య విద్యనభ్యసించాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా బడ్జెట్‌లో రూ.8 వేల కోట్లు కేటాయించి 17 వైద్య కళాశాలలకు గత సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల్లో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం దుర్మార్గపు ఆలోచనలతో వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుబాట చేపడతాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరుబాటలో భాగంగా సంతకాల సేకరణతో పాటు నిరసన కార్యక్రమాలను దశల వారీగా చేపడతామన్నారు. యువత, మేధావులు, వామపక్షాలు, తదితరులు పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేడు ఎంబీబీఎస్ చదవాలంటే రూ. కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రజాధనాన్ని పీల్చిపిప్పి చేయడమే చంద్రబాబు విధానమన్నారు. 2024 నాటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల, మచిలీపట్నంలో ప్రభుత్వ కళాశాలల పనులను పూర్తి చేసి తరగతులు కూడా ప్రారంభించడంతో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం రాకముందే పాడేరు, పులివెందుల కళాశాలల ప్రారంభానికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే, తమకొద్దంటూ ఎన్‌ఎంసీకి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని, చరిత్రలో ఎవరూ ఈ విధంగా చేసి ఉండరని మండిపడ్డారు.
రూ.5 వేల కోట్లతో కళాశాలలకు జీవం..
కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ డబ్బంతా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే నూతన వైద్య కళాశాలలను ఏర్పాటు చేయవచ్చన్నారు. ఖరీదైన భూములను తన అనుయాయులకు తక్కువ ధరకే ఇస్తూ చంద్రబాబు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. వైద్య విద్యనభ్యసించేందుకు ఏపీ, తెలంగాణ నుంచి ఇతర దేశాలకు ఏటా 4 వేల మంది విద్యార్థులు వెళ్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలోనే కథనం ప్రచురించారని, అయితే కేవలం తెలంగాణ ఎడిషన్‌లో మాత్రమే వచ్చిందని చెప్పారు. 1992లో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చూసి ప్రజాగ్రహానికి గురైన అప్పటి సీఎం నేదురమల్లి జనార్దన్ రెడ్డి చివరకు రాజీనామా చేశారని, చంద్రబాబుకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.
మద్యంలో బాబు అండ్ కోకు వాటాలు..
నకిలీ మద్యం తయారీ అతి పెద్ద స్కాం అని, దీని ద్వారా వచ్చే మొత్తం డబ్బు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌కు చేరుతోందని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ వెళ్తోందని ‘అనంత’ ఆరోపించారు. ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ ఘటనలో పట్టుబడిన జయ చంద్రారెడ్డి వైఎస్సార్ సీపీ కోవర్టని అంటున్నారని, మరి తమ పార్టీ నుంచి వచ్చిన అతనికి ఏవిధంగా టీడీపీ టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. తంబళ్లపల్లిలో ఓడిపోయాక ఇన్‌చార్జ్‌గా ఎందుకు నియమించారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయి మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కూడా కోవర్టులేనా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 43 వేల బెల్టుషాపులను ఒక్క సంతకంతో వైఎస్ జగన్ తొలగించేలా చర్యలు తీసుకుంటే.. చంద్రబాబు వచ్చాక మళ్లీ 70 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయన్నారు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్ర, సైఫుల్లాబేగ్, బాకే హబీబుల్లా, మల్లెమీద నరసింహులు, అమర్‌నాథ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు వెన్నం శివరామి రెడ్డి, జానీ, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్ణ, కార్పొరేటర్ కమల్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు.
బడుగులకు వైద్య విద్య కోసం 17 కళాశాలలకు వైఎస్ జగన్ శ్రీకారం
రూ.8 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు
మంజూరైన వైద్య సీట్లనూ
వద్దన్న ఘనుడు చంద్రబాబు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి