
వైద్యానికి ‘చంద్ర’ గ్రహణం!
45
90
● కూటమి ప్రభుత్వంలో రోగుల అవస్థలు
● ఇప్పటికే సమ్మెలో పీహెచ్‌సీ వైద్యులు
● నేటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్
జిల్లాలో ‘ఎన్టీఆర్ వైద్యసేవ’
నెట్‌వర్క్ ఆస్పత్రులు
46
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వంలో వైద్య రంగానికి ‘చంద్ర’గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో ఇటు ప్రభుత్వ.. అటు ప్రైవేట్ వైద్యుల ఆగ్రహం తారస్థాయికి చేరింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు ఇప్పటికే సమ్మెలోకి వెళ్లారు. అలాగే శుక్రవారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎన్‌టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లను పూర్తి స్థాయిలో ఆపేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) నేత డాక్టర్ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఆగనున్న శస్త్రచికిత్సలు
జిల్లాలోని ‘వైద్య సేవ’ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోజూ 100 నుంచి 200 వరకు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. అంకాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ, గైనిక్, నెఫ్రాలజీ, తదితర కేసుల్లో ప్రాణాంతకమైన వాటికి సత్వరం శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ హవర్‌లో వైద్యం అందించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. కానీ కూటమి ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు డబ్బు చెల్లించని కారణంగా నేటి (శుక్రవారం) నుంచి ‘వైద్యసేవ’లను బంద్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోగులు అత్యవసర వైద్యసేవలకు ఎక్కడికి వెళ్లాలన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
సర్వజనాస్పత్రిపై భారం!
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్ చేస్తుండడంతో అనంతపురం సర్వజనాస్పత్రిపై తీవ్ర భారం పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి రోగులు ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం సర్వజనాస్పత్రిలో తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రోజూ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్లు (ఓపీ) 2,500 నుంచి 3,000, ఇన్ పేషెంట్లు (ఐపీ) 1,100 నుంచి 1,300 మంది వరకు ఉంటారు. ఇప్పటికే ఆస్పత్రి పాలన అస్తవ్యస్తంగా మారింది. కనీస పర్యవేక్షణ కొరవడింది. వైద్యసేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈమధ్య కాలంలోనే పలువురు రోగుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మొద్దునిద్ర వీడకపోతే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముంది.
గ్రామీణుల అవస్థలు
పీహెచ్‌సీ డాక్టర్లు కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది వైద్యాధికారులు విధులకు దూరంగా ఉన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, అటెండర్లే దిక్కయ్యారు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందించే వారని, ఇప్పుడు ఆస్పత్రులకు వెళ్లినా వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు.
ఇందులో రోజూ జరిగే శస్త్ర చికిత్సలు
పీహెచ్‌సీలు మొత్తం
సమ్మెలో ఉన్న వైద్యాధికారులు

వైద్యానికి ‘చంద్ర’ గ్రహణం!