వైభవంగా చక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా చక్రస్నానం

Oct 10 2025 8:04 AM | Updated on Oct 10 2025 8:06 AM

ముగిసిన చింతలరాయుడి బ్రహ్మోత్సవాలు

తాడిపత్రి రూరల్‌: పట్టణంలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం చక్రస్నానం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఆలయ ఆవరణలోని పుష్కరిణికి అర్చకులు మురళి స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి భూదేవి, శ్రీదేవి సమేత చింతల వెంకటరమణస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించిన అనంతరం బ్రహ్మోత్సవాలను ధ్వజావరోహణంతో ముగించారు.

20 మండలాల్లో వర్షం

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలోని 20 మండలాల్లో వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 9.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గార్లదిన్నె 47.8 మి.మీ, వజ్రకరూరు 47.2, యాడికి 36, రాప్తాడు 26.2, అనంతపురం 17.4, బొమ్మనహాళ్‌ 13.4, గుంతకల్లు 10.2 మి.మీ వర్షం కురిసింది. బ్రహ్మసముద్రం, కూడేరు, విడపన కల్లు, కంబదూరు, ఉరవకొండ, బుక్కరాయసముద్రం, కుందుర్పి, నార్పల, ఆత్మకూరు, కణేకల్లు, బెళుగుప్ప, పామిడి, కళ్యాణదుర్గం, గుమ్మగట్ట తదితర మండలాల్లోనూ వర్షం పడింది. రాగల మూడు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

నేటి నుంచి బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపులో భాగంగా శనివారం నుంచి జిల్లాలో టీచర్లు బోధనేతర కార్యక్రమాలు బహిష్కరిస్తున్నట్లు ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ ఆనంద్‌, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబును కలసి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేవలం టీచర్లు, పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనం పనులు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, బోధన వంటి పనులు చేస్తారని తక్కిన బోధనేతర పనుల జోలికి వెళ్లరని స్పష్టం చేశారు. కలెక్టర్‌ను కలసిన వారిలో ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ శ్రీనివాస్‌ నాయక్‌, సెక్రెటరీ జనరల్‌ పురుషోత్తం, నాయకులు రత్నం, రమణారెడ్డి, సిరాజ్‌, రామాంజనేయులు, గోపాల్‌ రెడ్డి, వెంకట సుబ్బయ్య, ఫణిభూషణ్‌ తదితరులు ఉన్నారు.

కొత్త టీచర్ల ప్లేస్‌మెంట్స్‌కు కౌన్సెలింగ్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: డీఎస్సీకి ఎంపికైన కొత్త టీచర్లకు ప్లేస్‌మెంట్‌ (స్థానం) కోసం గురువారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఎస్జీటీలకు మ్యానువల్‌గా, స్కూల్‌ అసిస్టెంట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా స్థానాలు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం లోపు పూర్తికావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శిక్షణ కేంద్రాల్లోనే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఎస్జీటీ కౌన్సెలింగ్‌ ప్రారంభమై అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 167 మంది ఎస్జీటీలు వారికి నచ్చిన స్థానాన్ని కోరుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లలో చాలా మంది తొలిసారి వెబ్‌ కౌన్సెలింగ్‌ కావడంతో గందరగోళానికి గురి కాగా.. అధికారులు, సాంకేతిక నిపుణులు వారి అనుమానాలను నివృత్తి చేశారు. శుక్రవారం వారి కౌన్సెలింగ్‌ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు.

వైభవంగా చక్రస్నానం 1
1/2

వైభవంగా చక్రస్నానం

వైభవంగా చక్రస్నానం 2
2/2

వైభవంగా చక్రస్నానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement