
మాతా శిశు మరణాలపై మండిపాటు
అనంతపురం సిటీ: అనంతపురం శిశుగృహలో పసికందు ఆకలి చావు ఘటనపై దిశ కమిటీ సమావేశంలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఈ ఉదంతంలో ఐసీడీఎస్ పీడీని సస్పెండ్ చేసి అసలైన బాధ్యులను వదిలివేయడాన్ని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ నిలదీశారు. అనంతపురంలోని డీపీఆర్‌సీ భవన్‌లో గురువారం జిల్లా సమన్వయ దిశ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి బోయ గిరిజమ్మ, కలెక్టర్ ఆనంద్, సభ్యులు హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. శిశుగృహలో రెండు నెలల పసికందు ఆకలితో మరణించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ శిశువు మరణానికి కారణమైన ఉద్యోగులందరిపై చర్యలు ఉంటాయన్నారు. ఉపాధిలో అక్రమాలు
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రూ.కోట్లు మింగుతున్నారని, దీనిపై అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని బోయ గిరిజమ్మ కోరారు. నల్లరేగడి భూములున్న రైతులకు సబ్సిడీపై పప్పుశనగ సరఫరా చేయాలని బెళుగుప్ప ఎంపీపీ పెద్దన్న విజ్ఞప్తి చేశారు. వర్షాలతో దెబ్బతిన్న మొక్క జొన్న దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. పలు మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరాకు ఏటా రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు జెడ్పీ చెల్లిస్తున్నా నీటి పన్ను జెడ్పీకి జమ చేయకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వాడుకుంటున్నారని, దీంతో జెడ్పీ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని సభ దృష్టికి గిరిజమ్మ తెచ్చారు.
బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా?
ట్రాన్స్‌కో ఎస్‌ఈపై కలెక్టర్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా బాధ్యతరాహిత్యంగా సమాధానాలు ఇస్తే చార్జ్‌మెమో ఇస్తానంటూ హెచ్చరించారు. ప్రధాన రహదారుల పక్కనే ఫుట్‌పాత్ వదలకుండా విద్యుత్ స్తంభాలు నాటుతున్నారని కంబదూరు జెడ్పీటీసీ నాగరాజు సభ దృష్టికి తీసుకురాగా.. ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఆర్‌అండ్‌బీ అధికారులపై నిందలు వేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణించారు.
వాడీవేడిగా ‘దిశ’
శిశుగృహలో పసికందు సహా ఆస్పత్రుల్లో తల్లుల మరణాలపై చర్చ
బాధ్యులపై కఠిన చర్యలకు సభ్యుల డిమాండ్