
ఫీజుల కోసం వేధిస్తే చర్యలు
● ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులను ఫీజుల కోసం వేధింపులకు గురిచేస్తే చర్యలు తప్పవని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ హెచ్చరించారు. ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నారాయణ కళాశాలతో పాటు వివిధ కళాశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. దసరా సెలవుల తర్వాత కళాశాలలకు చేరుకున్న విద్యార్థులను ఫీజులు కడితేనే అనుమతిస్తామంటూ తల్లిదండ్రులపై ఒత్తిళ్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి సూచించిన పరీక్ష ఫీజు కన్నా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు కూడా తెలిసిందన్నారు. పరీక్ష ఫీజు అదనంగా వసూళ్లు చేస్తే కళాశాల గుర్తింపు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కళాశాల ఫీజు కట్టకున్నా విద్యార్థులను అనుమతించాలన్నారు. పరీక్ష ఫీజు కట్టించుకోవాలన్నారు.
గుత్తి విద్యార్థికి రూ. 51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం
గుత్తి: గుత్తి పట్టణానికి చెందిన షేక్ బాషా, రహమత్ దంపతుల కుమారుడు దాదా ఖలందర్‌కు రూ. 51 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం ఆఫర్ దక్కింది. హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ కళాశాలలో బీటెక్ సెకెండియర్ చదువుతున్నాడు. కళాశాలలో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో ప్రతిభ కనబరిచి ఏఎండీ కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని దక్కించుకున్నాడు. బీటెక్ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరనున్నట్లు సమాచారం.
యాడికిలో వరుస చోరీలు
యాడికి: మండల కేంద్రంలోని ఐదు ఇళ్లలో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి ఇద్దరు దుండగులు నెత్తికి రుమాలు చుట్టుకుని తాళం వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. కమ్మవీధిలోని వద్ది కృష్ణమూర్తి ఇంట్లో 50 తులాల వెండి, తమ్మినేటి రాజగోపాల్ నాయుడు ఇంట్లో రూ.4వేల నగదు, వెండి దీపాలు, కలశం, శాంతి నగర్‌లోని ఓబయ్య కుమారుడు పోతురాజు రాజయ్య ఇంట్లో రూ.37వేల నగదు, ఒక తులం బంగారు చైను, ఒక జత వెండి కాళ్ల పట్టీలు, సుమయాన్ ఇంట్లో రూ.10వేల నగదు, 2 తులాల బంగారం, కోన రోడ్డులోని కోటేష్ కుమారుడు గంగవరం శివ ఇంట్లో వెండి కాళ్ల పట్టీలు, వెండి మొలతాడును అపహరించారు. గురువారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన 5 ఇళ్లను పరిశీలించి కేసులు నమోదు చేశారు.