
రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 6న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కార స్థితి ఏ దశలో ఉందనే విషయాన్ని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekoram.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
అప్పుల బాధతో
రైతు ఆత్మహత్య
బెళుగుప్ప: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని యలగల వంక గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివ తెలిపిన మేరకు.. యలగలవంకకు చెందిన కురుబ పోతన్న (71) తన ఏడు ఎకరాల్లో బోర్లు వేయించేందుకు, పంటల సాగుకు సుమారు రూ.25 లక్షల అప్పు చేశాడు. కొన్ని సంవత్స రాలుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పోతన్న శనివారం విషపు గుళికలు మింగాడు. గుర్తించిన భార్య పార్వతమ్మ చుట్టుపక్కలవారి సాయంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే, చికిత్స ఫలించక పోతన్న మృతి చెందాడు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివ పేర్కొన్నారు.
ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవాలి
● అగ్నిమాపకశాఖ డీజీ వెంకటరమణ
అనంతపురం:ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) పి. వెంకటరమణ అన్నారు. శనివారం జేఎన్‌టీయూ(ఏ) ఆడిటోరియంలో జోన్–4 పరిధిలోని శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందిన అగ్నిమాపక శాఖ అధికారులు, సహాయ జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలోని అగ్నిమాపక సదుపాయాల స్థితిగతులపై ఆరా తీశారు. అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది బలోపేతం, కొత్త సాంకేతిక పరికరాల అవసరంపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థను అభివృద్ధి పరిచేలా సూచనలు ఇచ్చారు. ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారి (జోన్–4) ఎం. భూపాల్ రెడ్డి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
డ్రిప్, స్ప్రింక్లర్లపై జీఎస్టీ తగ్గింపు
అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై 12 శాతం ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెక్టారుకు రూ.4,450 వరకు రైతులకు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మంజూరై మెటీరియల్ పంపిణీ కాని, అలాగే రైతు వాటా చెల్లించి, పరికరాలు మంజూరు కాని వారు గత నెల 22 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు మేరకు మొత్తం 1,408 మంది రైతులకు రూ.67.63 లక్షల మేరకు తిరిగి వెనక్కి చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు 18 వేల హెక్టార్ల లక్ష్యం ఉన్నందున 2018–19 కన్నా ముందు డ్రిప్, స్ప్రింక్లర్లు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’