
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
● ఎస్పీ జగదీష్
రాప్తాడు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. అనంతపురం రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులు, చోరీలు, రికవరీలు, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ఆరా తీశారు. చోరీ కేసుల్లో రికవరీలు పెరగాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో కీలక పాత్ర పోషించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పెంచాలని ఆదేశించారు. సబ్ డివిజన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్థాలపై చైతన్య సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతర నిఘా ఉంచి, గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశులు, ఎస్పీ సీసీ ఆంజనేయ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
సమర్థవంతమైన సేవలందించాలి
శింగనమల (నార్పల): పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని ఎస్పీ జగదీష్ సిబ్బందికి సూచించారు. శనివారం నార్పల పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. మండలంలో పరిస్థితులు, కేసుల వివరాలను సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ సాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ల కదిలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ఉన్నారు.