
కేశవన్నా.. పప్పుశనగ ఇంకెప్పుడన్నా?
● ఆర్థిక మంత్రి ఇలాకాలోనే విత్తనానికి నిధులు ఇవ్వకుండా దాటవేత
● గత ఖరీఫ్, రబీకి సంబంధించి ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలు
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌లో కీలక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత జిల్లాలోనే రైతులు విత్తనాలు, ఎరువుల కోసం నానా పాట్లు పడుతున్నారు. ఖరీఫ్‌లో ఆలస్యంగా విత్తన వేరుశనగ పంపిణీ చేయడంతో రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. కనీసం పంపిణీ చేసిన విత్తనానికి సంబంధించి రాయితీ సొమ్మును ఏజెన్సీలకు కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. గత ఖరీఫ్, రబీతో పాటు ఈ ఖరీఫ్‌లో విత్తన వేరుశనగ, పప్పుశనగకు సంబంధించి ఏజెన్సీలకు రూ.74 కోట్ల బకాయిలు పెట్టడంతో ఏజెన్సీల నిర్వాహకులు విత్తన సరఫరాకు ముందుకు రావడం లేదు. దీంతో రబీలో పప్పుశనగ రాక ఆలస్యమవుతోంది. సీజన్ ప్రారంభమై నాలుగైదు రోజులైనా ఇప్పటికీ పంపిణీ ప్రక్రియ ప్రారంభించకపోవడం చూస్తే అసలు రైతులకు రాయితీ విత్తనం ఇస్తారా లేదా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వర్షం వస్తే నల్లరేగడి భూములు కలిగిన 25 మండలాల్లో పప్పుశనగ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.
ప్రత్యామ్నాయమూ లేదు..
ఖరీఫ్‌లో అననుకూల వర్షాలతో పంటల సాగు మందకొడిగా సాగింది. సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చినా... ఇంకా లక్ష ఎకరాల వరకు పొలాలు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇందులో విత్తుకునేందుకు ప్రత్యామ్నాయం కింద ఇవ్వాల్సిన ఉలవ, జొన్న, కొర్ర లాంటి విత్తనాలు కూడా ఇవ్వకుండా మరిపించేశారు. ఆగస్టు 25న నిర్వహించిన జిల్లాస్థాయి అభివృద్ధి కమిటీ (డీఆర్‌సీ)లో మంత్రి పయ్యావుల కేశవ్ ఖరీఫ్ సాగుపై సమీక్షించారు. ‘ప్రత్యామ్నాయం’ కింద విత్తనాలు అందిస్తామని ఘనంగా ప్రకటించిన ఆయన చివరకు దాని ఊసే ఎత్తలేదు. కనీసం రబీలోనైనా ముందస్తు సాగుకు వీలుగా విత్తన పప్పుశనగ అందించాల్సి ఉండగా ఇప్పటికీ మొదలు పెట్టలేదంటే రైతులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది.
పట్టించుకునే తీరికేదీ..?
రైతుల కష్టనష్టాల్లో పాలుపంచుకోవాల్సిన చంద్రబాబు సర్కారు వారి గురించి అసలు పట్టించుకోవడమే లేదు. గతంతో పోలిస్తే సగానికి సగం కోత పెట్టి ఈ రబీలో జిల్లాకు 14 వేల క్వింటాళ్లు, శ్రీ సత్యసాయి జిల్లాకు కేవలం 500 క్వింటాళ్ల రాయితీ పప్పుశనగ కేటాయించడం దీనికి అద్దం పడుతోంది. సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి తగ్గించి అదనపు భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ‘సూపర్‌సిక్స్– సూపర్‌హిట్’ అంటూ ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేసి సభ నిర్వహించింది. ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి కూడా నిధులు నీళ్లలా ఖర్చు పెట్టారు. డీఎస్సీలో ఎంపికై న వారికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి భారీ మొత్తం వెచ్చించి అమరావతికి పిలిపించుకున్నారు. ఇలా ఆర్భాటాలకు పోయి మంచినీళ్ల ప్రాయంగా ఖజానాను కరిగించేస్తున్న ప్రభుత్వం రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియా ఇవ్వకుండా రిక్తహస్తం చూపిస్తుండడం గమనార్హం.