
ఇసుక డంప్ సీజ్
బొమ్మనహాళ్: అక్రమంగా డంప్ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. వివరాలు... బొమ్మనహాళ్ మండలంలోని కురువల్లి, బొల్లనగుడ్డం గ్రామాలకు చెందిన కొందరు అధికార పార్టీ అండతో ఇసుక దందా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 25 ట్రాక్టర్ల ఇసుకను కురువల్లి గ్రామ శివారులో డంప్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నబీరసూల్, తహసీల్దార్ మునివేలు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించి, ఇసుక డంప్‌ను సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా నిల్వలు చేసిన వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ మునివేలు తెలిపారు.
ముగ్గురిపై కేసు నమోదు
గుత్తి: స్థానిక చెంబుల బావి వీధిలో రెండు రోజుల క్రితం రూ.300 కోసం గొడవపడి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయన్నారు. వాటి ఆధారంగా, బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన అప్జల్, ఆదిల్, ఆరీఫ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు వెల్లడించారు.
గాంధీ జయంతి రోజున యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
బ్రహ్మసముద్రం : మహాత్మా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం అమ్మకాలు నిషేధం. అయితే ఇందుకు బ్రహ్మసముద్రం గ్రామానికి అధికారులు మినహాయింపునిచ్చినట్లుగా ఉంది. గాంధీ జయంతి, దసరా రెండూ ఒకే రోజు రావడంతో బ్రహసముద్రంలో బెల్ట్‌షాపు నిర్వాహకులు హంగామా చేశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. బెల్ట్ షాప్‌ను పూలతో ముస్తాబు చేసి, 2వ తేదీ ఉదయం 6 గంటలకే మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు. విషయం తెలిసినా అటుగా రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. స్థానికులు కొందరు కళ్యాణదుర్గం ఎకై ్సజ్ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మరుక్షణమే బెల్ట్‌షాపు నిర్వాహకుడికి ఫోన్ చేసిన వారి సమాచారం అందించి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎకై ్సజ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా సాగుతోందంటూ స్థానికులు మండిపడ్డారు.

ఇసుక డంప్ సీజ్