
‘సాధారణం’తో సరి
అనంతపురం అగ్రికల్చర్: ‘ఖరీఫ్’ సాధారణ వర్షపాతంతో ముగిసింది. సెప్టెంబర్ నెలాఖరుతో సీజన్ ముగిసింది. ఈ ఏడాది ఖరీఫ్ మొదలు కాక ముందే తొలకర్లు పలకరించడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి. దానికి తోడు నైరుతి రుతుపవనాలు ఈ సారి మే 26న చాలా ముందుగానే ప్రవేశించడంతో అన్నదాత హర్షాతిరేకం వ్యక్తం చేశాడు. కానీ రుతుపవనాల ప్రవేశం తర్వాత వరుణుడు ముఖం చాటేశాడు. జూన్, జూలై రెండు నెలల పాటు వాన పడటం గగనంగా మారిపోయింది. జూలై ఆఖరుకే జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. జూన్‌లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. అది కూడా జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు కురిశాయి. జూన్ రెండో వారం తర్వాత పరిస్థితి మారిపోయింది. అలాగే, ఖరీఫ్ పంటలు విత్తుకునేందుకు అత్యంత కీలకమైన జూలైలో వర్షాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జూలైలో 64.3 మి.మీ గానూ 46 శాతం తక్కువగా 34.7 మి.మీ వర్షం కురిసింది. జూన్, జూలైలో కేవలం ఐదు వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం.
28 రెయినీ డేస్..
నాలుగు నెలల ఖరీఫ్‌లో 28 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. అందులో ఆగస్టులోనే 14 రికార్డు కాగా మిగతా మూడు నెలల్లో మరో 14 రోజులు నమోదు కావడం గమనార్హం. ‘సాధారణం’ నమోదైనా శింగనమల, పుట్లూరు, అనంతపురం, రాప్తాడు మండలాల్లో తక్కువగానే వర్షం కురిసింది. 10 మండలాల్లో ఎక్కువగానూ, 17 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇలా ఖరీఫ్‌లో వర్షాలకు సంబంధించి భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో పంటల సాగు పడుతూ..లేస్తూ సాగింది. ఎట్టకేలకు 3.43 లక్షల హెక్టార్లకు గానూ 88 శాతంతో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సారి 1.04 లక్షల హెక్టార్లతో కంది పంట మొదటి స్థానంలో ఉండగా, 90 వేల హెక్టార్లతో వేరుశనగ రెండో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వకపోవడంతో ఉలవ, పెసర, అలసంద, కొర్ర, జొన్న తదితర పంటలు నామమాత్రంగా మిగిలిపోయాయి. అననుకూల వర్షాలతో ఈ ఏడాది అన్నదాత పరిస్థితి అయోమయంగా తయారైంది.
మురిపించి.. కంగారెత్తించి
ఖరీఫ్ నాలుగు నెలల్లో
335.5 మి.మీ వర్షపాతం నమోదు
జూన్, జూలైలో వర్షాభావం,
ఆగస్టులో అధికంగా వర్షం
28 వర్షపు రోజులు...
77 డ్రైస్పెల్స్ నమోదు
88 శాతంతో 2.98 లక్షల హెక్టార్లలో పంటల సాగు