
విద్యుదాఘాతంతో గోశాల కార్మికుడి మృతి
ఆత్మకూరు: విద్యుత్ షాక్‌కు గురై గోశాల కార్మికుడు మృతిచెందాడు. ఘటనపై గోశాల నిర్వాహకుడు నిర్లక్ష్యంగా వ్యవహ రించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు జోక్యంతో బాధితులకు న్యాయం చేకూరింది. వివరాలు... ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని గోశాలలో కుర్లపల్లికి చెందిన సంజీవులు (40) పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం విద్యుత్ మోటారు సాయంతో నీటిని పడుతూ గోశాలను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతిచెందాడు. మృతదేహం ఐదు గంటల పాటు అక్కడే ఉన్నా... నిర్వాహకులు పట్టించుకోలేదు. కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. సంజీవులు మృతదేహంపై పడి భార్య రమాదేవి రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
న్యాయం చేయాలంటూ ఆందోళన
సంజీవులు మృతిపై న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో అనంతపురానికి చెందిన ఆదినారాయణ నాయుడు గోశాల నిర్వహిస్తున్నాడని, ఎండోమెంట్ అనుమతులు లేకపోయినా అనధికారంగా నడిపిస్తూ అక్కడ పనిచేస్తున్న దళితుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ మహిళా మండల మాజీ కన్వీనర్ సుభద్రమ్మ అక్కడకు చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. సంజీవులు మృతి చెందిన ఐదు గంటల సేపైనా ఆదినారాయణ నాయుడు అక్కడకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు అధికార పార్టీ నాయకుల అండతో పోలీసులను పక్కన పెట్టుకుని ఆదినారాయణనాయుడు అక్కడు చేరుకున్నారు. పెన్నోబులేసు తదితరులతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం చెల్లిస్తానంటూ అంగీకరించారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు చెల్లించారు. అనంతరం సంజీవులు భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ ప్రాంగణంలో ఘటన
మృతిపై స్పందించని గోశాల నిర్వాహకులు
బాధితుల ఆందోళన