పండుగ పూట పస్తులేనా? | - | Sakshi
Sakshi News home page

పండుగ పూట పస్తులేనా?

Oct 1 2025 10:21 AM | Updated on Oct 1 2025 10:21 AM

పండుగ పూట పస్తులేనా?

పండుగ పూట పస్తులేనా?

‘మా ప్రభుత్వంలో మాకే ఎదురు తిరుగుతారా? అయితే వారికి జీతాలు ఆపేయండి’ అనే ధోరణితో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లపై కూటమి ప్రభుత్వం కన్నెర్రజేసింది. ఫలితంగా తెలుగు పండుగల్లో అతిపెద్దదైన దసరా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక అంగన్‌వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండునెలలుగా జీతాలు లేకపోవడంతో మా ఇళ్లలో పండుగ కళ తప్పిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం సెంట్రల్‌/తాడిపత్రి రూరల్‌: అంగన్‌వాడీ టీచర్లకు పండుగ పూట కూడా పస్తులు తప్పడం లేదు. అగస్టు నెల గౌరవ వేతనం సెప్టెంబరు మొదటి వారంలో వారి బ్యాంకు ఖాతాల్లో పడాల్సి ఉండగా సెప్టెంబర్‌ నెల దాటినా అధికారులు వేయలేదు. జిల్లాలోని 13 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2,302 అంగన్‌వాడీ కేంద్రాలు, 223 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. దసరా పండగకు ఇక కేవలం ఒక రోజు మాత్రమే ఉంది. దసర సెలవుల పేరుతో ఇతర ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, బంధువుల రాకతో ఇళ్లు కళకళలాడుతున్నాయి. కొత్త దుస్తులు, పిండి వంటలు తదితరాలకు రూ.వేలల్లోనే ఖర్చు ఉంటోంది. అయితే రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో అంగన్‌వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

సెల్‌ఫోన్లు వెనక్కి ఇచ్చినందుకేనా?

అగస్టు నెల జీతం రాకపోవడానికి అంగన్‌వాడీ టీచర్లు తమ వద్ద సెల్‌ఫోన్లను అధికారులకు వెనక్కు ఇవ్వడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్‌ ద్వారా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే చాలా ఏళ్ల క్రితం మంజూరు చేసిన సెల్‌ఫోన్లు కావడంతో యాప్‌లో నమోదు ప్రక్రియ సకాలంలో జరగక అంగన్‌వాడీ సిబ్బంది ఇబ్బందులు పడుతూ వచ్చారు. పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్‌లను గత ఆగస్టులో వెనక్కు ఇచ్చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం.. గత నెల 25న చర్చలకు ఆహ్వానించింది. ఓ యూనియన్‌ (ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న) సెల్‌ఫోన్‌ వినియోగించడానికి సమ్మతించిండంతో అందరూ కూడా సెల్‌పోన్లను తీసుకుని పనిచేయాలని హుకుం జారీ చేసింది. దీంతో ప్రభుత్వ వైఖరిని ప్రధాన సంఘాలు వ్యతిరేకించాయి. ఆన్‌లైన్‌లో మాత్రం నమోదు చేయబోమని మాన్యువల్‌గా చేస్తామని స్పష్టం చేశాయి. దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జీతాలు నిలుపుదలతో అంగన్‌వాడీల మెడలు వంచే కుట్రకు తెరలేపింది. దీంతో ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌ గడిచినా జీతాలు అందలేదు.

2,302

జిల్లాలో అంగన్‌వాడీ సెంటర్లు

2,079

అంగన్‌వాడీ వర్కర్లు

222

మినీ అంగన్‌వాడీ వర్కర్లు

2,079

అంగన్‌వాడీ హెల్పర్లు

వెంటనే జీతాలు మంజూరు చేయాలి

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు గత రెండునెలలుగా జీతాలు పడలేదు. ప్రస్తుతం దసరా పండుగ వచ్చింది. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అంగన్‌వాడీ సిబ్బందికి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందిగా మారింది. పండుగ సరుకులు, నూతన దుస్తులు కొనుగోలు చేయలేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు మంజూరు చేయాలి.

– రమాదేవి, జిల్లా కార్యదర్శి ఏపీ అంగన్‌ వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌

అంగన్‌వాడీలకు అందని ఆగస్టు వేతనం

ముగిసిన సెప్టెంబరు నెల

సెల్‌ఫోన్‌లు తిరిగిచ్చేశారని ప్రభుత్వం కక్ష!

దసరా పండుగ సమయంలో డబ్బు లేక అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement