
ఉద్యోగులకు మొండిచేయి చూపిన ‘కూటమి’
● వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి
అనంతపురం ఎడ్యుకేషన్: దసరా కానుకగా రెండు డీఏలు, ఐఆర్ 30 శాతం ప్రకటిస్తారని ఎదురు చూసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధానకార్యదర్శి జి.శ్రీధర్‌గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలపై చర్చించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఇప్పటికై నా స్పందించి డీఏలు, 30 శాతం మధ్యంతర భృతి, సంపాదిత సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
తాగుడుకు డబ్బివ్వలేదని
కొడవలితో దాడి
అనంతపురం: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదంటూ సొంత మేనమామ కొడుకుపైనే కొడవలితో దాడి చేసిన ఘటన అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ జి.వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామ సింగిల్ విండో ప్రెసిడెంట్ చాకలి కేశన్న మంగళవారం సాయంత్రం అనంతపురంలోని పాతూరు జంగాలపల్లి మసీదు వద్ద ఉన్న సమయంలో మేనత్త కుమారుడు సుబ్బారావు కలసి మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రోజూ తాగుడుకు డబ్బు కావాలంటూ దౌర్జన్యం చేయడం సరికాదని కేశన్న సర్దిచెప్పబోతుండగా కొడవలితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు కేకలు వేయడంతో సుబ్బారావు అక్కడి నుంచి పారిపోయాడు. క్షతగాత్రుడు స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. బాధితుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఇద్దరూ టీడీపీకి చెందిన వారే కావడం, పైగా సమీప బంధువులు కావడంతో దాడిని రాజీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
అరటి చెట్టుకు రెండు గెలలు
పుట్లూరు: సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే వస్తుంది. అయితే ఇందుకు భిన్నంగా పుట్లూరు మండలం రంగరాజుకుంట గ్రామానికి చెందిన రైతు పొన్నపాటి హనుమంతురెడ్డి తోటలో ఒక చెట్టుకు రెండు గెలలు వచ్చాయి. నాలుగు ఎకరాల్లో అరటి పంటను సాగు చేయగా రెండవ పంటలో ఇలా ఒక చెట్టుకు మాత్రమే రెండు గెలలు వచ్చిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా రెండు గెలలు రావడం ఎన్నడూ చూడలేదని స్థానిక రైతులు చెబుతున్నారు. కాగా, అరటి మొక్క కాండంలో రెండవ శిరోజం ఏర్పడినప్పుడు ఇలా రెండు గెలలు వస్తాయని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఉద్యోగులకు మొండిచేయి చూపిన ‘కూటమి’