
2 నుంచి ప్రత్యేక రైళ్లు
● షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో..
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో రైళ్లు నడుస్తాయన్నారు. అక్టోబర్ 2 గురువారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్ జంక్షన్‌లో రైలు బయలుదేరి ధర్మవరం జంక్షన్‌కు శనివారం తెల్లవారుజూమున 3.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ధర్మవరం జంక్షన్ నుంచి (01438) అక్టోబర్ 4 శనివారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 10.30 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుందన్నారు. బీదర్, వికారాబాద్, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్డు, ములకలచెరువు, కదిరి రైల్వే స్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు.
బీదర్–బెంగళూరు మధ్య..
బీదర్–బెంగళూరు మధ్య అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. బీదర్ జంక్షన్ (07063)లో అక్టోబర్ 4 శనివారం మధాహ్నం 2.40 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు రైలు బెంగళూరు చేరుతుందన్నారు. తిరిగి అక్కడి నుంచి అక్టోబర్ 5 ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ చేరుకుంటుందన్నారు. హమ్నాబాద్, కమలాపూర్, కలబురిగి, షాహబాద్, వాడీ, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యలహంక సేష్టన్ల మీదుగా రైలు నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.