
ఆర్డీటీని సమైక్యంగా కాపాడుకోవాలి
● కలెక్టర్ ఆనంద్‌కు ప్రజా సంఘాల నాయకుల వినతి
అనంతపురం అర్బన్: పేదల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఆర్డీటీ సంస్థను సమైక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాసంఘాల అఖిలపక్ష కమిటీ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నిర్వహించిన పరిష్కార వేదికలో కలెక్టర్ ఓ.ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెవెన్యూవల్ చేయని కారణంగా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పేదలకు అందిస్తున్న కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ముఖ్యంగా వైద్య సేవలు అందక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు చొరవ చూపి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలన్నారు. కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సాకేహరి, ఎమ్మార్పీఎస్ ఓబులేసు, ఐఎంఎం బాషా, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, బేడబుడగ జంగాల సంఘం అంజి, పుసల సంఘం మధు, ఆర్డీటీ మాజీ ఉద్యోగులు గోవిందు, చండ్రాయుడు, హెల్పింగ్ హ్యాండ్స్ షబ్బీర్, నజీర్, ఎరికల సంక్షేమ సంఘం ముసలన్న పాల్గొన్నారు.