
ఇబ్బందులు పెట్టేవారిని వదలం
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని వదిలి పెట్టబోమని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారని, ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమస్యతో పాటు ఇబ్బంది పెట్టిన వారి వివరాలు, ఫొటోలు, సమాచారం నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు నేరుగా అధినేత వైఎస్ జగన్ దృష్టికి వెళ్తాయని, ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వారితో కలసి తిరగడం బాలకృష్ణకు సిగ్గుగా లేదా అని నిలదీశారు. తండ్రి పార్టీని లాక్కున్నా వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి బాలకృష్ణది కాదన్నారు. ఆయనకు ఏ సర్టిఫికెట్లు ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ బాల కృష్ణ చంద్రబాబు చెంత చేరి ఎన్టీఆర్ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన చలువతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అనేక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇళ్ల వద్దకే పథకాలు అందించారన్నారు. జగనన్నకు అందరూ తోడుగా ఉండాలన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న కాలంలో రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పూల ప్రసాద్, మహేశ్వరరెడ్డి, ఎల్లారెడ్డి, శివ శంకర్, ఖాదర్‌వలి,జెడ్పీటీసీలు భాస్కర్,బోగాతి ప్రతాప్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోకుల్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మిద్దె కుళ్లా యప్ప, చామలూరు రాజగోపాల్, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ నాయక్, మేజర్ పంచాయతీ సర్పంచ్ పార్వతి, పూల నారాయణ స్వామి, చికెన్ నారాయణస్వామి, శ్రీరామిరెడ్డి, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమాన్ని గాలికి
వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
సమస్యలపై ప్రశ్నిస్తే
అక్రమ కేసులతో వేధింపులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు
డిజిటల్ బుక్‌తో భరోసా
పార్టీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి
తండ్రికి చెడ్డపేరు తెచ్చేలా బాలకృష్ణ ప్రవర్తన: మాజీ మంత్రి శైలజానాథ్