
జీఎస్‌టీపై అవగాహన కల్పించాలి
అనంతపురం అర్బన్: జీఎస్‌టీ 2.0పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఏపీఎంఐపీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సూపర్ జీఎస్‌టీ – సూపర్ సేవింగ్స్’ పోస్టర్లు, స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీ చేసి తగ్గిన జీఎస్‌టీ సక్రమంగా అమలు చేస్తున్నారా.. లేదా పరిశీలించాలన్నారు. తగ్గిన జీఎస్‌టీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని చెప్పారు. పరిశ్రమలు, సూక్ష్మ సేద్యం, వ్యవసాయం, క్రీడా వస్తు సామగ్రి, ఎలక్ట్రానిక్, స్టేషనరీ తదితర దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేయాలని చెప్పారు. జీఎస్‌టీ సంస్కరణలతో 99 శాతం వస్తువులు, సేవలు పన్నురహితంగా మారాయన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, ఏపీఎంఐపీడీ రఘునాథరెడ్డి, డీపీఓ నాగరాజు నాయుడు, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి మంజుల పాల్గొన్నారు.
జిల్లాలో మరో రెండు
ఎంఎస్‌ఎంఈ పార్కులు
అనంతపురం టౌన్: జిల్లాలో మరో రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామంలో 50 ఎకరాలు, కూడేరులో 100 ఎకరాల్లో పార్క్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న వారు ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఇప్పటికే రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బరితెగించిన ఇసుకాసురులు
● ఇసుక అక్రమ తరలింపునకు ఏకంగా మట్టి రోడ్డు ఏర్పాటు
శింగనమల: ఇసుకాసురులు బరితెగించారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వివరాలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక మండలంలో పలువురు టీడీపీ నాయకులు ఇసుకపై కన్నేశారు. ఇటీవల మండలంలోని రాచేపల్లి వద్ద పెన్నానదిపై వీరి కన్ను పడింది. నదిలో ఇసుక పుష్కలంగా అందుబాటులో ఉండడంతో కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచించారు. ఇసుక తరలించడానికి ఏకంగా ఎర్రమట్టితో రోడ్డు వేసుకున్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఇసుకను తరలించడానికి జేసీబీతో వెళ్తున్న వీరిని రాచేపల్లికి చెందిన రైతులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై సోమవారం ఉన్నతాధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.
కుమారుడికి పెళ్లి కాలేదని బలవన్మరణం
అనంతపురం సిటీ: వ్యక్తి ఆత్మహత్య కేసులో మిస్టరీని రైల్వే పోలీసులు ఛేదించారు. వివరాలను సోమవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం రాజీవ్‌కాలనీ పంచాయతీ పరిధిలోని పొట్టి శ్రీరాములు కాలనీకి చెందిన సల్లా మల్లికార్జున(59)కు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లి కాగా, కుమారుడికి ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక్కటీ కుదరలేదు. దీంతో కుమారుడికి ఇక పెళ్లి కాదేమోననే బెంగతో ఈ నెల 27న అనంతపురం సమీపంలో మల్లికార్జున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడి ఆచూకీ లభ్యమైంది.

జీఎస్‌టీపై అవగాహన కల్పించాలి