
పప్పుశనగ విత్తన కేటాయింపులు కుదింపు
అనంతపురం అగ్రికల్చర్: రైతులపై కూటమి సర్కారు చిన్నచూపు ధోరణి కొనసాగిస్తోంది. అరకొర విత్తనాలు, ఎరువుల కేటాయింపులతో చెలగాటమాడుతోంది. తాజాగా రబీలో ప్రధాన పంటగా పండించే విత్తన పప్పుశనగ కేటాయింపులను 14 వేల క్వింటాళ్లకు కుదించింది. విత్తన కేటాయింపులు, ధరలు, సబ్సిడీ ప్రకటిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా మరో రెండు రోజుల్లో రబీ ప్రారంభమవుతున్న తరుణంలో ఆలస్యంగా కేటాయింపులు, ధరలు ప్రకటించింది. ఈ క్రమంలో విత్తన కేటాయింపులను గతంలో కన్నా సగానికి తగ్గించడం గమనార్హం. ఇక సబ్సిడీ కూడా 40 శాతం నుంచి 25 శాతానికి కుదించడంతో జిల్లా రైతులపై రూ.1.65 కోట్లు భారం పడే పరిస్థితి నెలకొంది. జేజీ–11 రకం క్వింటా పూర్త్తి ధర రూ.7,800 కాగా అందులో 25 శాతం రాయితీ రూ.1,950 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
పట్టించుకునే వారు కరువు..
అన్నదాతను మొదటి నుంచి చంద్రబాబు సర్కారు ఇబ్బందులకు గురి చేస్తోంది. మొదటి ఏడాది ‘సుఖీభవ’ కింద రూ.400 కోట్లకు పైగా ఎగ్గొట్టిన ప్రభుత్వం రెండో ఏడాది రూ.5 వేలు ఇచ్చినా... ఇంకా వేల మందికి సొమ్ము జమ కాని పరిస్థితి. ఇక ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ కింద పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వడం లేదు. ఈ ఖరీఫ్‌లో కూడా విత్తన వేరుశనగ ఆలస్యంగా ఇవ్వడంతో రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక యూరియా పరిస్థితి ఎంత చెప్పినా తక్కువే. రైతులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ‘ప్రత్యామ్నాయం’ ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు సర్కారు... తాజాగా అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రబీ రైతులకు కూడా కుచ్చుటోపీ పెట్టేందుకు పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆలస్యం తప్పదా...?
గతేడాది ఖరీఫ్, రబీతో పాటు ఈ ఖరీఫ్‌లో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సొమ్ము చెల్లించకుండా బకాయిలు పెట్టడంతో ఇప్పుడు రబీలో పప్పుశనగ సరఫరాకు ఏజెన్సీలు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రబీ రైతులకు సకాలంలో విత్తన పప్పుశనగ అందడం కష్టంగానే కనిపిస్తోంది. ఖరీఫ్‌లో మాదిరిగా రబీలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పంట సాగు విస్తీర్ణంపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయితీ కూడా 40 శాతం నుంచి
25 శాతానికి తగ్గింపు
రైతన్నలపై చిన్నచూపు ధోరణిని కొనసాగిస్తున్న ‘కూటమి’
ప్రభుత్వ అలసత్వంతో అన్నదాతలపై రూ.1.65 కోట్ల అదనపు భారం