
‘బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
గుత్తి: మెగా స్టార్ చిరంజీవిపై రాష్ట్ర అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు పాటిల్ సురేష్ డిమాండ్ చేశారు. గుత్తిలో గాంధీ సర్కిల్ వద్ద ఆదివారం చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. బాలకృష్ణ డౌన్‌డౌన్ అంటూ ప్లేకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాటిల్ సురేష్ మాట్లాడారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పక పోతే ఆందోళన కార్యక్రమాలు విస్తృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, దుర్గాప్రసాద్, ఓబులేసు, వెంకటేష్, రుద్రాక్షల రాజా, నూర్‌బాషా, నాగరాజు, హరి, షెక్షావలి తదితరులు పాల్గొన్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
రాయదుర్గం టౌన్: మండలంలోని మల్లాపురం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు ఆదివారం సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డ్రోన్ ఎగురవేసి, స్థావరాన్ని గుర్తించారు. అలాగే రాయదుర్గం సమీపంలోని వట్లకుంట కొండ ప్రాంతంలో సాయంత్రం చేపట్టిన తనిఖీల్లో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.87,150 నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● తాడిపత్రి రూరల్: మండలంలోని చుక్కలూరు వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలు, పెన్నానది బ్రిడ్జి కింద పేకాట అడుతున్న 15 మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి అప్‌గ్రెడ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదివారం తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసి రూ.41,930 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే తాడిపత్రిలోని సీపీఐ కాలనీలో పేకాట అడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.37,370 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
● గుత్తి రూరల్: మండలంలోని జక్కలచెరువు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రామారావు తెలిపిన మేరకు.. గ్రామ శివారులోని ఓ తోటలో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పట్టుబడిని ఏడుగురిని అరెస్ట్ చేసి, నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ.39,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.