
లైన్‌మెన్‌కు విద్యుత్ షాక్
● పరిస్ధితి విషమం.. బళ్లారికి తరలింపు
బొమ్మనహాళ్: విద్యుత్ షాక్‌తో గ్రేడ్–2 జూనియర్ లైన్‌మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బొమ్మనహాళ్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొమ్మనహాళ్ విద్యుత్ కార్యాలయంలో గ్రేడ్–2 జూనియర్ లైన్‌మాన్‌గా రామాంజినేయులు విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు వెంకటేశులు తన పొలంలో 11 కేవీ విద్యుత్ లైన్ హెడ్ ఫ్యూజు పోయిందని తెలపడంతో ఆదివారం ఉదయం మరమ్మతు చేసేందుకు రామాంజనేయులు వెళ్లాడు. కురువల్లి బొమ్మనహాళ్ ఫీడర్ లైన్ కింద ఉన్న ఈ లైన్‌కు స్ధానిక సబ్‌స్టేషన్ నుంచి ఎల్‌సీ తీసుకుని, ప్యూజు వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురై పై నుంచి కిందకు పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన రైతులు వెంటనే ఓ ప్రైవేట్ అంబులెన్స్‌లో బళ్లారిలోని విమ్స్‌కు తరలించారు. రెండు చేతులు, ఓ కాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమ్స్ వైద్యులు తెలిపారు సమాచారం అందుకున్న రాయదుర్గం ఏడీఏ శ్రీనివాసనాయుడు, బొమ్మనహాళ్ ఏఈఈ లక్ష్మీరెడ్డి బళ్లారికి చేరుకుని క్షతగాత్రుడిని పరామర్శించారు. ఆపరేటర్ తప్పిదమే కారణమనే అనుమానాలు ఉన్నాయని, దీనిపై లోతైన విచారణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
స్నేహితుడిపై కత్తితో దాడి
తాడిపత్రి టౌన్: పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన రఫీపై స్నేహితుడు సన్నీ కత్తితో దాడి చేశాడు. సన్నీకి సరిపడని వారితో రఫీ మాట్లాడుతున్నాడన్న కారణంగా ఆదివారం మద్యం మత్తులో కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వీపుపై తీవ్రగాయమైన రఫీని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.
సంతల ఆదాయం
రూ.3.62 లక్షలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గత వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.3.62 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.2,22,250 వసూలు కాగా ఆదివారం జరిగిన పశువులు, ఎద్దుల సంత నుంచి రూ.1,40,600 మేర వసూలైనట్లు వివరించారు.